‘‘నేను మీడియా ముందుకు వచ్చిన ప్రతీసారి.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అని అడుగుతుంటారు. నేను సింగిల్‌గా ఉంటే చూడలేకపోతున్నారా? లేక నేను సింగిల్‌గా ఉండటం మీకు ఇష్టం లేదా?’’ అని మీడియాని ప్రశ్నించింది బబ్లీ బ్యూటీ హన్సిక. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మహా’. హన్సికకు ఇది 50వ చిత్రం. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. విడుదల విషయంలో మీనమేషాలు లెక్కబెడుతోంది. ఎట్టకేలకు విడుదల విషయంలో ఓ క్లారిటీ రాగా, ఇప్పుడు చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలపై హన్సిక దృష్టిపెడుతోంది. అందులో భాగంగా ఆమె చెన్నై మీడియాకి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఎదురుకాగా, పై విధంగా హన్సిక బదులిచ్చింది.
‘‘నేను నటించిన మొట్టమొదటి లేడీ ఒరియంటెడ్ చిత్రం ‘మహా’. నాకు ఛాలెంజింగ్ పాత్రలంటే చాలా ఇష్టం. అందుకే ఈ సినిమా చేశాను. ఇలాంటి పాత్రలలో చేయాలని ఎప్పటి నుండో వేచి చూస్తున్నాను. ఇప్పటి వరకు అన్ని రకాల పాత్రలు చేశాను. ఈ చిత్రంలో ఇప్పటి వరకు నేను చేయని తల్లి పాత్రలో నటించాను. ఇది నా కెరీర్‌లో గొప్ప చిత్రంగా నిలబడుతుందనే ఆశతో ఉన్నాను. ప్రస్తుతం 10కి పైగా చిత్రాలలో చేస్తున్నాను. అందులో రెండు తెలుగు చిత్రాలు కూడా ఉన్నాయి. నేను మీడియా ముందుకు ఎప్పుడు వచ్చినా.. పెళ్లి ఎప్పుడు? అంటూ ప్రశ్నిస్తున్నారు. నేను సింగిల్‌గా ఉంటే మీకేంటి? నన్ను సింగిల్‌గా చూడలేకపోతున్నారా? నేను అలా ఉండటం ఇష్టం లేదా? ప్రస్తుతం నేను కెరీర్‌పైనే దృష్టి పెట్టాను. అందులో ఉన్న పనితోనే ప్రస్తుతానికి నా పెళ్లి..’’ అంటూ హన్సిక ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
అయితే మీడియా ఆమె ముందు పెళ్లి గురించి ప్రస్తావించడానికి కారణం లేకపోలేదు. కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో ఆమె పెళ్లి పీటల వరకు వెళ్లింది. చివరి నిమిషంలో పెళ్లి ఆగిపోయింది. కారణం ఏమిటనేది పక్కన పెడితే.. పెళ్లి పీటల వరకు వెళ్లి.. ఆగిపోయిన హన్సికని మీడియా ఆ ప్రశ్న అడగడం తప్పేం కాదు. అలా అడిగిన ప్రశ్నకే.. హన్సిక.. పనితోనే పెళ్లి అన్నట్లుగా సమాధానమిచ్చింది. ఇక హన్సిక విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె 30 మందికి పైగా అనాథ చిన్నారులను చేరదీస్తూ.. వారి సంరక్షణను చూసుకుంటోంది.