రూ. 1000 కోట్లు.. పెద్ద అంకె మరి. ఒక హీరో అంత అమౌంట్ రెమ్యూనరేషన్‌గా కావాలని డిమాండ్ చేస్తుంటే వార్త వైరల్ కాకుండా ఉంటుందా? బీభత్సంగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరా హీరో? ఏమా కథ? అనేది తెలుసుకోవాలంటే.. బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టాల్సిందే. బాలీవుడ్ బుల్లితెరపై అప్రతిహతంగా ప్రసారం అవుతూ.. దిగ్విజయంగా 15 సీజన్లు పూర్తి చేసుకుని.. 16వ సీజన్‌లోకి బిగ్‌బాస్ అడుగుపెట్టబోతోంది. ఈ షోకి గత 13 సీజన్లుగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. రాబోయే 16వ సీజన్‌ని కూడా ఆయనే హోస్ట్ చేయాలని ‘బిగ్‌బాస్’ నిర్మాతలు భావిస్తుంటే.. వారికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడట సల్మాన్ ఖాన్. 15వ సీజన్‌కి తీసుకున్న రెమ్యూనరేషన్‌కి 3 రెట్లు రెమ్యూనరేషన్ ఇస్తేనే హోస్ట్‌గా వ్యవహరిస్తానని సల్మాన్ డిమాండ్ చేస్తున్నట్లుగా బాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి.
సల్మాన్ గత సీజన్ అంటే 15వ సీజన్‌కి రూ. 350 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ లెక్కన.. ప్రస్తుతం సల్మాన్ డిమాండ్ చేస్తున్న ప్రకారం.. రూ. 1050 కోట్లు అతనికి బిగ్‌బాస్ యాజమాన్యం రెమ్యూనరేషన్‌గా ఇవ్వాలి. ఇలా సీజన్ మొదలవబోతున్న ప్రతీసారి.. రెమ్యూనరేషన్ విషయంలో సల్మాన్ డిమాండ్ చేయడం, లేదంటే హోస్ట్‌గా తప్పుకుంటున్నాడనేలా వార్తలు రావడం సహజంగానే వినిపిస్తూ ఉంటుంది. కానీ ఈసారి సల్మాన్ డిమాండ్ చేస్తున్న అమౌంట్ వింటుంటేనే షాక్ అవ్వాల్సిన పరిస్థితి. మరి నిర్మాతలు ఎలా సల్మాన్‌ను ఒప్పిస్తారో తెలియదు కానీ, అతను మాత్రం అంత ఇస్తేనే.. అన్నట్లుగా మొండిపట్టు పట్టాడనేలా బాలీవుడ్ మీడియా రాసుకొస్తుంది.
ప్రస్తుతం బిగ్‌బాస్ 16వ సీజన్‌కు సంబంధించి కంటెస్టెంట్స్ ఎంపిక జరుగుతోంది. ఈ సమయంలో ఇలా సల్మాన్ డిమాండ్ చేయడంతో.. ‘బిగ్‌బాస్’ యాజమాన్యం నిజంగానే షాక్‌లో ఉన్నట్లుగా టాక్. సల్మాన్‌ను కంటిన్యూ చేయాలా? లేదంటే హోస్ట్‌ని మార్చి.. కార్యక్రమాన్ని కొనసాగించాలా? అనే ఆలోచనలో వారు ఉన్నట్లుగా సమాచారం. అయితే దీనిపై అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.