లేడీ పవర్‌స్టార్ క్రేజ్‌ని సొంతం చేసుకున్న సాయిపల్లవి.. ఇంతకు ముందు ఎప్పుడూ, ఎన్నడూ లేని విధంగా ‘విరాట పర్వం’ చిత్రంతో వివాదంలో చిక్కుకుంది. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆమె మాట్లాడిన కొన్ని మాటలు వివాదంగా మారడం, తద్వారా ఆమెపై కేసులు నమోదవ్వడం వంటి విషయాలు అందరికీ తెలిసినవే. ఆ సినిమా విడుదలై, థియేటర్లలో నుండి పోయి, ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా సాయిపల్లవిని వివాదాలు వీడకపోవడం విశేషం. ప్రొమోషన్స్ టైమ్‌లో కశ్మీర్ ఫైల్స్ సినిమాలోని విషయంపై.. అలాగే గోరక్షకుల విషయంలో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దేశవ్యాప్తంగా హిందూ సమాఖ్యలు ఆమె వ్యాఖ్యలను వ్యతిరేకించారు. హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో ఓ భజ్‌రంగ్ దళ్ కార్యకర్త సాయిపల్లవిపై ఫిర్యాదు చేయడంతో.. ఆమెపై కేసు కూడా నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు హైకోర్టు సాయిపల్లవికి షాకిచ్చింది.
హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు నిమిత్తం.. పోలీసులు సాయిపల్లవికి నోటీసులు పంపించగా.. ఆ నోటిసులను రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టును సాయిపల్లవి ఆశ్రయించింది. సాయిపల్లవి అభ్యర్థనను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చి.. ఆమెకి షాకిచ్చింది. ఖచ్చితంగా ఆ నోటీసులకు ఆమె స్పందించాల్సిందేనని తెలుపుతూ.. సాయిపల్లవి అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఇప్పుడు తప్పనిసరిగా ఆమె ఈ కేసుపై స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆల్రెడీ.. తను మాట్లాడిన మాటలకు వివరణ ఇవ్వడమే కాకుండా.. ఇన్‌స్టా వేదికగా సాయిపల్లవి క్షమాపణలు కూడా చెప్పింది. అయినా కూడా, ఆమెను ఈ వివాదం వదలకపోవడం గమనార్హం.