అరవింద సమేత తర్వాత మూడేళ్ళ గ్యాప్ ఇచ్చి ట్రిపుల్ ఆర్ తో ప్రేక్షకాభిమానులు ముందుకు వచ్చిన ఎన్టీఆర్ తన తదుపరి సినిమా విషయంలో ఇంకా ఊరిస్తూనే ఉన్నారు. మొన్నామధ్య తన బర్త్ డే సందర్భంగా కొరటాల శివ కాంబోలో సినిమా అనౌన్స్ అయినప్పటికీ.. ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ ని కొత్త లుక్ లో చూస్తామా.. మళ్ళీ ఎప్పుడు కొత్త సినిమాతో వెండితెరపైకి వస్తారు.. అంటూ ఫాన్స్ ఆవురావురమంటూ ఆకలితో ఉన్నారు. అలాగే మిగతా హీరోలందరూ శరవేగంతో పలు ప్రాజెక్ట్స్ లతో దూసుకుపోతుంటే తారక్ ఇంకా ఇంకా వన్ బై వన్ చేసే ప్రాసెస్ లో ఉండడం అభిమానులకి రుచించడం లేదు.
కొరటాల శివ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా ఉంది అని తెలిసినా, ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సినిమా ఇంకా డైలమాలోనే ఉన్నా.. తారక్ మాత్రం వరసగా సినిమాలు చేస్తే చూడాలని, తన సినిమా అప్ డేట్స్ వినాలని ఉవ్విళూరుతున్నారు. దీనిలో భాగంగానే ఈ రోజు కొత్తగా ఒక న్యూస్ స్ప్రెడ్ అవడం స్టార్ట్ అయ్యింది. నేషనల్ అవార్డ్ విన్నర్ వెట్రిమారమ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ సినిమా చెయ్యబోతున్నాడు అంటూ, ప్రాజెక్ట్ కన్ ఫమ్ అయ్యిపోయింది అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే తమిళ్ లో తీసిన ప్రతి సినిమాని ఓ అద్భుతమైన చిత్రంగా మలిచిన వెట్రిమారన్ కి చాలామంచి పేరు ఉంది.
వెంకటేష్ చేసిన నారప్ప ఒరిజినల్ సినిమా అసురన్ డైరెక్టర్ కూడా వెట్రి మారన్. అసురన్ మాత్రమే కాదు, విసరనై, ఆడుకాలం ఇవన్నీ కూడా తమిళంలో కల్ట్ క్లాసిక్స్ గా పేరు తెచ్చుకున్నాయి. విసరనై అయితే ఏకంగా ఆస్కార్ కి వెళ్తే అసురన్, ఆడుకాలం రెండింటితో ధనుష్ నేషనల్ అవార్డు కొట్టాడు. అది వెట్రిమారన్ డైరెక్షన్ స్టయిల్. రా, రస్టిక్, రగడ్ కేరెక్టర్స్ తో ఆన్ స్క్రీన్ బలమైన ముద్ర వెయ్యగలిగే పాత్రలను సృష్టించడం వెట్రిమారన్ స్టయిల్. నిజంగా ఈ వార్తల్లో నిజముంటే మాత్రం వెట్రిమారన్ స్క్రిప్ట్ కి ఎన్టీఆర్ లాంటి నటుడు తోడైతే మరో అద్భుతాన్ని చూడబోతున్నాం. అతి త్వరలోనే మరో అద్భుతాన్ని చూస్తాం, అది జరగాలని ఆశిద్దాం.