సపోర్టింగ్ రోల్స్ నుండి హీరోగా ఎదిగిన సత్య దేవ్.. ఇప్పటికీ స్టార్ హీరోల సినిమాల్లో మంచి కేరెక్టర్స్ చేస్తూనే ఉన్నాడు. హీరోగానూ, కేరెక్టర్ ఆర్టిస్ట్ గాను వరస ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న సత్య దేవ్ గోపి గణేష్ పట్టాభి దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్ గాడ్సే లో నటించాడు. నేడు ఆడియన్స్ ముందుకు వచ్చిన గాడ్సే మూవీ రాజకీయ, అవినీతి, విరుద్యోగ నేపథ్యంతో తెరకెక్కినది. సత్య దేవ్ గాడ్సే పాత్రలో స్టైలిష్ గాను, నటుడిగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాడు. డైలాగ్ డిక్షన్, పాత్రలోని ఇన్‌టెన్సిటినీ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించిన తీరు బావుంది.
కథలోకి వెళితే సిటీలోని కొంత మంది ప్రముఖులను, రాజకీయనాయకులని ఎవరో అగంతకులు కిడ్నాప్ చేస్తారు. మీడియాకు ఏ విషయము తెలియనీయకుండా కేసుని డీల్ చేయమని అధికారులను ఆదేశిస్తాడు సీఎం. ఆ ఆగంతకుడు స్పెషల్ ఆఫీసర్ గా లీవ్ లో ఉన్న వైశాలి తో మట్లాడాలని చెప్పగా అధికారులు వైశాలిని పిలిపిస్తారు. నగరంలోని ప్రముఖులను కిడ్నాప్ చేసింది గాడ్సే (సత్యదేవ్) అని తెలుస్తుంది. గాడ్సే ముందు భారీ పరిశ్రమల శాఖా మంత్రి, తర్వాత పార్లమెంట్ సభ్యుడు, చీఫ్ జస్టిస్, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వంటి వారితో మాట్లాడుతాడు. గాడ్సే వారితో ఫోన్ లో ఏం చెప్పాడు? రాజకీయ ప్రముఖులను మాత్రమే ఎందుకు టార్గెట్ చేసాడు? వారిలో కొందరిని ఎందుకు చంపేస్తాడు? అనేది సిల్వర్ స్క్రీన్ మీదే చూడాలి.
నేటి రాజకీయ పరిస్థితులకు లింకు పెడుతూ దర్శకుడు గోపి గణేష్ పట్టాభి కథను రాసుకున్నాడు. పోలీసులు రిస్కీ ఆపరేషన్ తో సినిమాని ప్రారంభించారు. ఒక్కొక్కరిని ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేయడంతో ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ పెంచారు. కానీ ఫస్ట్ హాఫ్ లో కథ లో క్లారిటీ లేకుండా చేసారు. సెకండ్ హాఫ్ సత్యదేవ్ బ్యాగ్డ్రాప్, వరుసగా కిడ్నాపులు చేసి వారందరినీ ఎందుకు చంపాలని అనుకున్నాడు లాంటివి చూపించారు. అక్కడ ఆసక్తి స్థానంలో జాలి క్రియేట్ చేసారు.
నిరుద్యోగం, అవినీతి వంటి విషయాలతో రాజకీయనాయకులు తలుచుకుంటే ఏమి చేయగలరు.. లాంటి అంశాలను కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు. ఎక్కడా వెనక్కి తగ్గకుండా హీరోతో మాట్లాడించే ప్రతి డైలాగ్ తో ప్రేక్షకులను ప్రశ్నించినట్టు అనిపిస్తుంది. కథ -కథనం విషయంలో కూడా పగడ్బందీగా ప్లాన్ చేసుకోవడంతో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సత్యదేవ్ అయితే వన్ మ్యాన్ షో చేసాడు. ఇంట్రెస్టింగ్ పొలిటికల్ డ్రామానే అయినా.. ప్రమోషన్స్ లేకుండా వదిలెయ్యడంతో ఈ సినిమా ఆడియన్స్ కి అంతగా రీచ్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు.