సౌత్ సినిమాలు పాన్ ఇండియా మూవీస్ బాలీవుడ్ లో భాజాభజంత్రీలు మోగించేస్తున్నాయి. సౌత్ సినిమాల కలెక్షన్స్ చూసి బాలీవుడ్ హీరోలు బేజారెత్తిపోతున్నారు. రాధే శ్యామ్ సినిమా ప్లాప్ అయినప్పుడు పండగ చేసుకున్న బాలీవుడ్ బ్యాచ్, ట్రిపుల్ ఆర్, కెజిఎఫ్ 2 హిట్స్ తో మళ్ళీ కుళ్ళుకుంటున్నారు. మధ్యలో సౌత్ vs నార్త్ గొడవలు. ఇక బాలీవుడ్ సినిమాలు వరసగా ప్లాప్ అవడం కూడా హిందీ సినిమా ఇండస్ట్రీ అందరి ముందు చులకనయ్యే పరిస్థితి వచ్చింది. ఏదో కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ కలిసి భూల్ భులైయా 2 తో మళ్ళీ ఇండస్ట్రీకి కళ వచ్చినా అది ఎంతోసేపు నిలవలేదు. అక్షయ్ కుమార్ పృథ్వీ రాజ్ ఎన్నో అంచనాల మధ్యన విడుదలై నెగెటివ్ టాక్ తెచ్చుకుంది.
300 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమాకి కనీసం 50 కోట్లు కూడా వచ్చాయో.. లేదో. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కిన సామ్రాట్ పృథ్వీ రాజ్ లో అక్షయ్ సరసన మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లార్ నటించింది. ఎన్నో అంచనాలు, ఎంతో క్రేజ్ తో రిలీజ్ అయిన ఈ సినిమా రెండోరోజుకు చేతులెత్తేసింది. జూన్ 3 న విడుదలైన ఈ సినిమా.. కొన్ని రోజులకే థియేటర్స్ లో ప్రేక్షలు లేక వేళా వేళా బోతున్నాయని, ఇంకొన్ని థియేటర్స్ లో ఒకరిద్దరు ఆడియన్స్ ఉండడంతో కొన్నిచోట్ల సినిమా ప్రదర్శన ఆపేశారని.. బాలీవుడ్ మీడియాలో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.. సినిమాలో కంటెంట్ లేకపోవడం, ప్రేక్షకులకి అస్సలు నచ్చకపోవడంతో అక్షయ్ కుమార్ సినిమాని ఈ దుస్థితి పట్టింది అంటూ కొన్ని వెబ్ సైట్స్ రాసుకొచ్చాయి.
అమ్మో అక్షయ్ కుమార్ సినిమా మరీ అంత ఘోరంగా ఉందా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.