కోలీవుడ్ లో రాజకీయ ఫ్యామిలీ (కరుణానిధి మనవడిగా) నుండి వచ్చి సినిమా ఇండస్ట్రీలో హీరో గా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ఉదయనిధి స్టాలిన్.. ఇప్పుడు ఓ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు. తాను ఇంకా సినిమాల్లో నటించబోనని, తనకి సినిమాల కన్నా రాజకీయాలే ముఖ్యమని .. ఇకపై తన పూర్తి సమయాన్ని రాజకీయాల కోసం ఉపయోగించాలని, ప్రజలకి సేవ చేయడమే తన ధ్యేయమని, అయితే సినిమాల్లో నటిస్తూ పూర్తి స్థాయిలో రాజకీయాలకి, ప్రజా సేవకి సమయాన్ని కేటాయించలేకపోతున్నాను అని.. అందుకే సినిమాలకి దూరం అవ్వాలనుకుంటున్నట్టుగా, తాను నటించిన మామన్నన్ సినిమా విడుదల తర్వాత ఇకపై సినిమాల్లో కనిపించను అంటూ ఉదయనిధి స్టాలిన్ మామన్నన్ సినిమా ప్రమోషన్స్ లోనే ప్రకటించారు.
తన తండ్రి స్టాలిన్ ముఖ్యమంత్రి కాకముందు నుండే ఉదయనిధి.. ప్రజా సేవకి అంకితమయ్యారు. ఇక స్టాలిన్ సీఎం అయ్యాక తండ్రి తో పాటుగా ఉదయనిధి కూడా నిత్యం ప్రజలతో మమేకమవుతూ ప్రజల అవసరాలను, పేద ప్రజలను ఆదుకుంటూ రాజకీయంగా బిజీగా మారారు. అయితే అటు సినిమాలు, ఇటు రాజకీయాలకు టైం కేటాయించలేకనే ఉదయనిధి స్టాలిన్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నారని ఆయన మాటల్లోనే స్పష్టమవుతుంది.. ఈ డెసిషన్ పై ఉదయనిధి ఫాన్స్ కాస్త బాధపడుతున్నా.. అటు పొలిటికల్ గా ప్రజలకు ఆయన దగ్గరలోనే ఉంటారని వాళ్ళు హ్యాపీ గా ఉన్నారు