మెగాస్టార్ చిరంజీవి - రామ్ చరణ్ కలయికలో సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య మూవీ ఫలితం అందరికి తెలిసిందే. చిరు - చరణ్ కలయిక అన్నా ఎవరిలో ఆచార్య పై ఆశక్తి కలగలేదు, లేదంటే టికెట్ రేట్స్ పెంపు కారణమో.. ఇంకేదన్నా కారణాలో కానీ ఆచార్య కి అనుకున్న ఓపెనింగ్స్ కూడా రాలేదు. మెగాస్టార్ లో చరిష్మా తగ్గిందో.. లేదంటే పెద్ద సినిమాలంటే ఆడియన్స్ కి బోర్ కొట్టిందో కానీ, ఆచార్య ని కొన్న బయ్యర్లు ఘోరంగా నష్టపోయారు. రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సక్సెస్ మ్యానియా కూడా ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించలేకపోయింది అంటేనే ఆచార్య విషయంలో ఎక్కడో ఏదో తేడా కొట్టిన ఫీలింగ్ వస్తుంది.
ఆచార్య ని కోట్లు పెట్టి కొన్న బయ్యర్లు గగ్గోలు పెడుతున్నారు. ఏకంగా ఓ డిస్ట్రిబ్యూటర్ చిరంజీవికి బహిరంగ లేఖ రాసాడు. ఆచార్య ని కొని తీవ్రంగా నష్టపోయాను అని, నష్టాన్ని పూడ్చమని అడిగారు. అలాగే చాలామంది బయ్యర్లు ఆచార్య నిర్మాతలపై ఒత్తిడి తీసుకువస్తున్నారనే ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయమై రామ్ చరణ్ రంగంలోకి దిగారని, బయ్యర్ల తో మాట్లాడి ఆచార్య కి వచ్చిన నష్టాలను ఎంతోకొంత పూడుస్తాను అని హామీ ఇవ్వడమే కాకుండా వారిని ఒప్పించే ఏర్పాట్లలో చరణ్ ఉన్నారని అంటున్నారు. మరి చరణ్ ఆచార్య బయ్యర్లని ఆదుకుంటే మంచి విషయమే అంటున్నారు నెటిజెన్స్.