ప్రపంచం మొత్తం ఆయనవైపు చూస్తుంది. బాహుబలి తో ఎన్నో సంచలనాలకు నెలవైన రాజమౌళి ట్రిపుల్ ఆర్ తో ఎలాంటి సంచనాలు సృష్టిస్తారో అని ప్రతి భాషకు చెందిన ప్రేక్షకుడు ఎదురు చూస్తున్నాడు. తన హీరోలైన ఎన్టీఆర్ - చరణ్ లతో రాజమౌళి ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ కోసం శ్రమిస్తున్నారు. ఈరోజు కర్ణాటక - ఆంధ్ర సరిహద్దు చిక్ బళ్లాపూర్ లో జరిగిన ట్రిపుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అద్భుతంగా, చరణ్, ఎన్టీఆర్ ఫాన్స్ రచ్చ మధ్యన జరిగింది. అయితే ఈ ఈవెంట్ కి కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై కూడా చీఫ్ గెస్ట్ లుగా హాజరయ్యారు. ఇక రాజమౌళి స్టేజ్ పై ఉండి శివ రాజ్ కుమార్ ని స్టేజ్ పైకి పిలవగానే ఫాన్స్ గోల గోల చేసారు. దానితో రాజమౌళి కి కొద్దిగా కోపం వచ్చింది. అక్కడే ఉన్న బౌన్సర్లు ని, సింగర్స్ ని స్టేజ్ పై నుండి దిగమని కాస్త గట్టిగానె అరిచారు.
తర్వాత స్టేజ్ పై రాజమౌళి మాట్లాడుతూ తనతో పని చేసిన టెక్నీకల్ టీం కి పేరు పేరు నా కృతఙ్ఞతలు తెలిపారు. తెలంగాణలో సినిమా టికెట్ రేట్స్ పెంచమని సీఎం కేసీఆర్ ని అడగ్గానే.. తెలుగు సినిమా వైపు ప్రపంచం చూస్తున్నప్పుడు తెలుగు సినిమా కోసం ఏమైనా చెయ్యాలంటూ టికెట్ రేట్స్ పెంచారు. వెంటనే జీవో రావడానికి కారణమైన తలసాని గారికి, సీఎం కేసీఆర్ కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఆంధ్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి థాంక్స్ చెబుతున్నాను. ఎందుకంటే మా సినిమా కి టికెట్ రేట్స్ పెంచుకునే అవకాశం ఇచ్చారు. అటు ట్రిపుల్ కి నష్టం లేకుండా ఇటు పెద్దవాళ్ళకి నష్టం జరక్కుండా టికెట్ రేట్స్ పెంచుకునే అవకాశం ఇచ్చిన పేర్ని నాని, కొడాలి నాని గార్లకి ప్రతేకంగా థాంక్స్ చెబుతున్నా అన్నారు.
ఇక సినిమా ఇండస్ట్రీ సమస్యల్ను నెత్తిన వేసుకుని పోరాడి, సీఎం జగన్ గారితో ఉన్న సాన్నిహిత్యంతో ఆయన్ని ఒప్పించి ఇండస్ట్రీ సమస్యల కోసం ముందుండి పోరాడిన మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను. మమ్మల్ని నెగ్గించడానికి ఆయన ఎంతో తగ్గారు.. దాని కోసం ఆయన ఎంతోమందితో ఎన్నో మాటలు పడ్డారు. కానీ ఇండస్ట్రీ సమస్య కోసం ముందుండి అన్నీ చక్కబెట్టారు.. ఆయన ఒప్పుకోకపోయినా చిరునే ఇండస్ట్రీ పెద్ద అని, ఆయన ఇండస్ట్రీ బిడ్డ అంటున్నప్పటికీ.. ఆయన్ని నేను పెద్దగానే గౌరవిస్తాను అంటూ రాజమౌళి అన్నిటిని అందరిని భలే కవర్ చేసుకుంటూ వచ్చారు.