సామజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాల తాకిడి రోజురోజుకీ పెరుగుతూనే వస్తోంది. ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వాడేస్తోన్న ప్రస్తుత దశలో.. ఇంటర్నెట్ సౌకర్యంతో సహా ఈజీగా సిమ్ కార్డులు లభించేస్తోన్న ఈ రోజుల్లో ఫేక్ రాయుళ్ల పని కేక్ వాక్ అయిపోయింది.
ఒరిజినల్ అకౌంట్స్ నుంచి అయితే అభిప్రాయాలు, అభిరుచులు, సలహాలు, సమస్యల వంటివి వ్యక్తం అవుతుంటాయి. కానీ ఫేక్ అకౌంట్స్ నుంచి మాత్రం విమర్శలు, దూషణలు, మోసాలు, లైంగిక వేధింపులు వంటివి విరివిగా వినిపిస్తుంటాయి.. తరచుగా కనిపిస్తుంటాయి.
ఇక కులాల వారీగా గ్రూపులు కట్టేసి పొలిటికల్ పార్టీల పేరిట చేసే వాదోపవాదాలు - అభిమాన హీరోల పేరిట వాగ్యుద్ధాలు వంటి వాటిలో అయితే ఇంకా పెచ్చుమీరి రెచ్చిపోతున్నారు.
సరే అవన్నీ పక్కన పెడితే.. సోషల్ మీడియాలో రీచ్ కోసం సెలెబ్రిటీల కుటుంబ సభ్యుల పేర్లతోనూ ఫేక్ ఐడీలను పుట్టించేంత తెగించేయడాన్ని మాత్రం తప్పక ఖండించాలి. వీలైనంత త్వరగా నిరోధించాలి.
తమిళ హీరో అజిత్ భార్య షాలిని, జూ.ఎన్ఠీఆర్ భార్య ప్రణతి వంటి పలువురి ఫేక్ అకౌంట్స్ ఇప్పటికే వెలుగులోకి రాగా... నేడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ పేరిట ట్విట్టర్ లో ఓ అకౌంట్ ప్రత్యక్షం అయింది.
తనయుడు రామ్ చరణ్ ని ఆప్యాయంగా ముద్దాడుతూ ఉన్న సురేఖమ్మ ఫైల్ ఫోటోని ప్రొఫైల్ ఫొటోగా పెట్టడంతో కొందరు అభిమానులు అది నిజమేనని నమ్మారు. దాంతో ఇక ఫాలోవర్స్ మొదలవడంతో ఆ దుండగుడు అదే పేరుతో యూట్యూబ్ ఛానెల్ నూ ఓపెన్ చేసేయడం గమనార్హం.
ఈ అంశంపై చిరంజీవి వ్యక్తిగత కార్యవర్గాన్ని సినీజోష్ సంప్రదించగా అది హండ్రెడ్ పర్శంట్ ఫేక్ అకౌంట్ అని స్పష్టం చేసారు.. ఇప్పటికే చర్యలు చేపట్టామన్నారు.
మరిలా స్టార్ హీరోల భార్యల పేర్లతో నకిలీ ఖాతాలను సృష్టించి, అభిమానులను ఆకర్షించి, ఫాలోవర్స్ ని పొందాక వెకిలి వేషాలు మొదలుపెట్టే నకిలీ రాయుళ్లకు లాఠీలతో లైకులు కొడితే తప్ప బుధ్ధి రాదేమో.. సంకెళ్లతో కళ్లెం పడితే తప్ప తప్పుడు పనులు ఆపరేమో.!