గత రెండు రోజులుగా కాస్త నీరసంగాను, ఎడమ చేయి లాగడం వంటి లక్షణాలతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు యశోద ఆసుపత్రిలో జాయిన్ అవడంతో టిఆర్ ఎస్ కార్యకర్తలు, ఆయన అభిమానులు కాస్త ఆందోళన చెందారు. కేసీఆర్ వెంట ఆయన భార్య, కుమార్తె కవిత, మనుమడు, ఎంపీ సంతోష్ ఉన్నారు. వైద్యులు కేసీఆర్‌కు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్‌కు గుండె మరియు యాంజియో, సిటీ స్కాన్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సీఎంవో వెల్లడించింది. విషయం తెలుసుకున్న మంత్రులు కేటీఆర్, హరీశ్, మరియు టిఆర్ ఎస్ కార్యకర్తలు.. సోమాజిగూడ యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. కేసీఆర్ అస్వస్థతకు గురవడంతో ఆయన ఈరోజు యాదాద్రి పర్యటనను రద్దు చేసుకున్నారు.
ఈమధ్యనే ఢిల్లీ లో కూడా కేసీఆర్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. యశోద ఆసుపత్రి వైద్యులు కేసీఆర్ కి ప్రాథమిక పరీక్షల అనంతరం యాంజియోగ్రామ్ నిర్వహించినట్లు చెప్పారు. జనరల్ చెకప్‌లో భాగంగా అన్ని పరీక్షలు చేసినట్లుగా ప్రకటించారు. అంతేకాకుండా సిటీ స్కాన్‌తో పాటు గుండెకు యాంజిగ్రామ్ పరీక్షలు చేసాక, ఆయనకు ఎలాంటి బ్లాక్స్ లేవని తేలిందని వైద్యులు చెప్పారు. సీఎం గారికి సీటీ స్కాన్, కార్డియాక్ యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించామని.. రొటీన్ పరీక్షల్లో భాగంగానే అన్ని పరిక్షలు చేశామని, రిపోర్టులను బట్టి ఏం చేయాలో చూస్తాం. కేసీఆర్‌గారు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఇది కేవలం ప్రివెంటివ్ చెకప్ మాత్రమే అని వైద్యులు తెలిపారు. ఓ వారం పాటు కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అని వైద్యులు వెల్లడించారు. వైద్య పరీక్షలు అనంతరం యశోద ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లిపోయారు.