మెగాస్టార్ చిరంజీవి ఒంటరిగా వెళ్లి ఏపీ సీఎం జగన్ ని కలిసి లంచ్ చెయ్యడమే కాదు.. సినిమా ఇండస్ట్రీ సమస్యలపై చర్చించి వచ్చాక.. మళ్ళీ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ప్రముఖులైన రాజమౌళి, మహేష్ బాబు, ప్రభాస్, కొరటాల శివని తీసుకుని మళ్ళి జగన్ తో సమావేశమై టికెట్ రేట్స్ పెంపు, ఐదో ఆటకి అనుమతులు.. ఇంకా చాలా సమస్యలను పరిష్కారాల హామీలతో వెనుదిరిగి వచ్చారు. ఆ రోజే మీడియా ముఖంగా ప్రముఖులు జగన్ కి థాంక్స్ చెప్పారు. ఆనాడు జరిగిన సమావేశంలో జగన్ ఇచ్చిన హామీలని.. కమిటీ ఏర్పాటు చేసి, ప్రభుత్వం తాజాగా అమలులోకి తెచ్చింది. టికెట్ రేట్స్ పెంపు జీవో పై జగన్మ్ మోహన్ రెడ్డి ఈ రోజు సైన్ చెయ్యడంతో.. ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఏపీ సీఎం జగన్ కి కృతఙ్ఞతలు తెలియజేస్తున్నారు.
మెగాస్టార్ చిరు సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ జీవో జారీ చేసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పరిశ్రమ తరపున కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు సినిమా పరిశ్రమకు మేలు కలిగే విధంగా, అటు థియేటర్ల మనుగడను, ప్రజలకి వినోదం అందుబాటులో ఉండాలనే సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని, సినిమా టికెట్ రేట్స్ సవరిస్తూ.. సరికొత్త జీవో జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌గారికి పరిశ్రమ తరపున కృతజ్ఞతలు. చిన్న సినిమాకు ఐదవ షో అవకాశం కల్పించడం ఎందరో నిర్మాతలకు ఉపయోగపడే అంశం. సంబంధిత మంత్రివర్యులు పేర్ని నానిగారికి, అధికారులకి, కమిటీకి ధన్యవాదాలు.. అంటూ ట్వీట్ చేసారు.