రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ - క్రేజీ హీరోయిన్ సమంతలు మహానటి కథను నడిపించే పాత్రల్లో జంటగా కనిపించినప్పటికీ అది పెద్దగా కిక్కివ్వలేదు ప్రేక్షకులకి. ఎందుకంటే మహానటి పూర్తిగా సావిత్రి కథనం కావడంతో విజయ్ - సమంతల నడుమ ఆడియన్స్ కోరుకునే ఆటలేవీ సాగలేదు. అయితే అభిమాన జనుల ఆశను తీర్చేందుకు మరో మజిలీని క్రియేట్ చేయనున్నారట దర్శకుడు శివ నిర్వాణ.
ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో పాన్ ఇండియా ఫిలిం లైగర్ ని పూర్తి చేసేసి ఉన్న విజయ్ దేవరకొండ వెంటనే పూరితోనే జనగణమన ప్రాజెక్ట్ చేసేందుకు సిద్ధపడ్డాడు. కానీ దాని ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా ఉండడం, అదంతా చేసుకుని ఆగస్టులో వెళదాంలే షూటింగ్ కి అనుకోవడంతో ఈలోపు శివ నిర్వాణతో ఉన్న కమిట్ మెంట్ ఫుల్ ఫిల్ చేసేందుకు కదిలాడు విజయ్ దేవరకొండ.
అదిగో ఆ ప్రాజెక్ట్ కోసమే విజయ్ - సమంతల కాంబోని కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇప్పటికే శాకుంతలం షూటింగ్ కంప్లీట్ అయిపోగా, యశోద షూట్ వర్క్ కూడా జెట్ స్పీడ్ లో చేసేస్తోన్న సమంతకి మరో హాలీవుడ్ ప్రాజెక్టు కూడా ఉంది. అయితే శివ నిర్వాణ చెప్పిన స్టోరీ లైన్ సమంతని బాగా ఆకట్టుకుందని తెలుస్తోంది. సో.. ఇక డేట్స్ ఎలాట్ చేయడం లాంఛనమే అనేది ఇన్ సైడ్ టాక్.
ఓ సరికొత్త కాన్సెప్ట్ తో.. కాశ్మిర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ ట్రెండీ లవ్ స్టోరీ మనకి మళ్ళీ గీత గోవిందంలోని విజయ్ దేవరకొండని - అ ఆ లోని సమంతని చూపేలా ఉంటుందని అంటున్నారు. అలాగే సంచలన సంగీత తరంగం అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా ఫైనల్ అయ్యారు కనుక విజయ్-సమంతల కాంబోలో విజువల్ ఫీస్ట్ లా రూపొందే ఈ చిత్రం మ్యూజికల్ గాను మేజిక్ చేస్తుందని ఆశిద్దాం. మరిన్ని వివరాలతో వెలువడే అధికారిక ప్రకటన కోసం వేచి చూద్దాం.!