చిన్న సినిమాలైనా, పెద్ద సినిమాలైనా థియేటర్స్ లో ఒకటి రెండు వారాలు ఆడితేనే గాని బయ్యర్లు గట్టెక్కరు, నిర్మాతలకి లాభాలు రావు. కానీ ఇప్పుడున్న సిట్యువేషన్ లో ఏ సినిమా అయినా (హిట్ అయినా, ఫట్ అయినా) ఒకటి రెండు వారాలు ఆడడం కష్టంగా మారింది. ఓ పక్క కోవిడ్ సిట్యువేషన్, మరోపక్క ఓటిటీల హవా. ఏ సినిమా అయినా రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ఓటిటి నుండి ఆడియన్స్ ముందుకు రావడంతో.. చాలామంది థియేటర్స్ కి వెళ్లి సినిమా చూసే ఇంట్రెస్ట్ తగ్గించేసుకుంటున్నారు. గతంలో చాలా సినిమాలు 100 రోజులు, 200 రోజులు ఆడి రికార్డులు నెలకొల్పేవి. కానీ ఇప్పుడు పట్టుమని 25 రోజులు పూర్తి చేసుకోవడానికి కిందా మీదా పడుతున్నాయి.
అంతెందుకు నిన్నగాక మొన్న రిలీజ్ అయిన భీమ్లా నాయక్ విషయమే తీసుకోండి. భీమ్లా నాయక్ థియేటర్స్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో నానా హంగామా చేసారు. ఇంకేంటి భీమ్లా నాయక్ కి లాభాలే లాభాలు అనుకున్నారు. కానీ ఫస్ట్ వీకెండ్ లో భీమ్లా నాయక్ కలెక్షన్ కళకళలాడుతూ బాగానే ఉన్నాయి. కాకపోతే సోమవారం వచ్చేసరికి భీమ్లా నాయక్ కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. మళ్ళీ మంగళవారం శివరాత్రి రోజున కలెక్షన్స్ పుంజుకున్నా.. బుధ గురు వారాల్లో భీమ్లా నాయక్ జోరు కొనసాగించలేకపోయింది. దానితో కలెక్షన్స్ లో భారీ డ్రాప్ కనిపించింది.
హిట్ సినిమా అయినా, పెద్ద సినిమా ఆయినా కేవలం సెలవురోజులైనా, లేదంటే వీకెండ్స్ లోనే కలెక్షన్స్ రాబడతాయి అనేది తేటతెల్లమైంది. మరి భారీ బడ్జెట్ సినిమాలకి ఇలా అయితే కష్టమే. రేపు రాబోయే రాధే శ్యామ్, ఆర్.ఆర్.ఆర్ మూవీస్ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియాలంటే ఆ సినిమాలు వచ్చేవరకు వెయిట్ చెయ్యాల్సిందే.