శివుని ఆన అయిందేమో గంగ ఒడికి లింగమే కదిలొస్తానంది... అంటూ బాహుబలి తో మొదలైంది ప్రపంచ సినీ యవనికపై తెలుగు చిత్రాల ప్రభావం.. ప్రతాపం.
ఇండియాలోని బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్ తో బాటు గొప్పగా చెప్పుకునే హాలీవుడ్ కూడా తెలుగు సినిమాల వైపు తల తిప్పి చూస్తోన్న తరుణం ఇది.
ఇన్నాళ్ళుగా.. ఎన్నో ఏళ్లుగా మనం ఎంతలా కోరుకున్నా, ఎంతగా కష్టపడ్డా లేని ఖ్యాతి రాని కీర్తి నేటికి సాకారమై తెలుగు సినిమా సాధించుకున్న వైభవం ఇది.
మొత్తానికి టాలీవుడ్ జెండా రెపరెపలాడింది అనుకునే రెప్పపాటు లోపే కరోనా కాటేసింది.
లాక్ డౌన్ షాక్ ఇచ్చింది. జనాల ఉత్సాహం జారిపోయింది.
కానీ... ఫస్ట్ వేవ్ భరించారు. సెకండ్ వేవ్ సహించారు. థర్డ్ వేవ్ తెగించారు.
మన ప్రేక్షకుల చొరవతో, ఏ ప్రాంత ప్రేక్షకుడినైనా ఒప్పించి మెప్పించగలిగే మన దర్శకుల తెలివితో కోవిడ్ ఎఫెక్ట్ తర్వాత కూడా భారతీయ సినిమాకి పూర్వ వైభవం తెప్పించింది తెలుగు సినిమాయే అని నిరూపించారు.
బాక్సాఫీస్ రికార్డుల్ని బద్దలుకొట్టే సినిమాలతో తెలుగు జాతి గౌరవాన్ని సాక్ష్యాత్తు దేశ ప్రధాని ప్రసంగం సాక్షిగా నిలబెట్టారు.
ఈ ఊపు ఇక్కడితో ఆగేలా లేదు. ఏ స్థాయికి వెళుతుందో ఎవరూ ఊహించలేని రాధే శ్యామ్, ఎంతటి స్థాయిని అయినా అందుకోగలిగే ఆర్ ఆర్ ఆర్, మెగాస్టార్ ఆచార్య, సూపర్ స్టార్ సర్కారు వారి పాట... ఇలా మున్ముందు మరెన్నో సంచలనాలకు - సాటి లేని విజయాలకు కేంద్ర బిందువు కాబోతోంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ.
నేడు మహా శివరాత్రి సందర్బంగా ఇప్పటికే విడుదలకి సిద్ధంగా ఉన్న సినిమాలు, సిద్ధమవుతోన్న సినిమాలు చిన్న,పెద్ద, అవీ ఇవీ తేడా లేకుండా చాలా సినిమాల అప్ డేట్స్ ఆవిష్కృతం కానున్నాయి. మరి ఆ మహేశ్వరుని కృపకు మరికొంత కాలం మన టాలీవుడ్ నోచుకుంటే... ఆ ముక్కంటి కాస్త కటాక్షించి ఓ లుక్కేస్తే రాబోయే రోజుల్లో తెలుగు సినిమా యావత్ భారతీయ సినీ పరిశ్రమని శాసిస్తుంది. ప్రపంచ సినిమాతో పోటీకి సై అంటుంది. ఇక నీదే భారం ఓ శివయ్యా.. ఓం నమః శివాయ.!