సినీ ప్రేక్షకులు సమంత మాయలో పడి నేటికి పుష్కరం పూర్తయింది. 2010 ఫిబ్రవరి 26 న విడుదలైన ఏ మాయ చేసావే చిత్రంలో జెస్సీగా తెర పైకి వచ్చి మెస్మరైజింగ్ పెర్ ఫార్మెన్సుతో మ్యాజిక్ చేసేసింది సమంత. నట విశ్వ విద్యాలయం అనదగ్గ అక్కినేని నాగేశ్వరరావు గారే స్వయంగా సదరు సినిమాలో సమంతకే ఎక్కువ మార్కులు దక్కుతాయి అనడం ఆమెకు తొలి చిత్రంతోనే దక్కిన అతి పెద్ద కితాబని చెప్పొచ్చు. అందం - అభినయం రెండూ ఉండడం అతి పెద్ద ప్లస్ పాయింట్ అయిన సమంతకి కథల ఎంపికలోనూ మంచి అభిరుచి ఉండడంతో తనని వరుస విజయాలు వరించాయి. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఆమెని స్టార్ హీరోయిన్ గా నిలబెట్టాయి.
హీరోయిన్ గా ఎన్నో హిట్స్ చవి చూసినప్పటికీ ఏ మాయ చేసావే లోని జెస్సీ, ఈగలోని బిందు, ఎటో వెళ్ళిపోయింది మనసులోని నిత్య, సీతమ్మ వాకిట్లో గీత, ఆ ఆ లోని అనసూయ, రంగస్థలంలోని రామలక్ష్మి వంటి పాత్రలు నటిగా సమంత ప్రత్యేకతను చాటి చెప్పాయి. ఆమధ్య ఆహా అనిపించేలా సామ్ జామ్ టాక్ షో లో సందడి చేసిన సమంత ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 లో అయితే రాజీగా అదరగొట్టేసింది. బోల్డ్ సీన్స్ ఉన్నప్పటికీ విలక్షణమైన పాత్రల పోషణలో రాజీ పడేదే లేదని స్పష్టం చేసింది.
ఇక రీసెంట్ గా పుష్పలో ఊఁ అంటావా మావా... ఉ ఊఁ అంటావా మావా అనే ఐటెమ్ సాంగుతో యావత్ దేశంలోని కుర్రకారుని ఊపేసిన సమంత త్వరలో వన కన్య శకుంతలగా కెరీర్ లో తొలిసారి పురాణ పాత్రతో రాబోతోంది. గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా ఫిలింగా వస్తోన్న ఆ శాకుంతలం సమంత కెరీర్ కి మరో బెంచ్ మార్క్ అవ్వాలని, అలాగే తదుపరి చిత్రం యశోద కూడా తనకి మరో మెమొరబుల్ ఫిలిం అవ్వాలనీ కోరుకుంటూ ఎంతో ఆత్మ విశ్వాసంతో అడుగులు వేస్తోన్న సమంతకి ఆల్ ది బెస్ట్ చెబుతోంది సినీజోష్.