పవన్ తుఫాన్ థియేటర్లపై గట్టిగా దాడి చేసింది. దాని ధాటికి కలెక్షన్లు వెల్లువెత్తుతుంటే ఆ ప్రవాహంలో పాత రికార్డులు గల్లంతవుతున్నాయి. USA లో ప్రీమియర్స్ తోనే $ 859 K రాబట్టి ఓవరాల్ గా తొలి రోజునే ఒన్ మిలియన్ మార్క్ క్రాస్ చేసిన భీమ్లా నైజాంలో అయితే ఏకంగా ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. బేసిక్ గానే పవర్ స్టార్ కి స్ట్రాంగ్ జోన్ అయిన నైజాంలో భీమ్లా నాయక్ కి గ్రాండ్ వెల్ కమ్ చెబుతూ బిగ్గెస్ట్ ఓపెనింగ్సుతో హగ్గిచ్చారు ఫ్యాన్స్. వరదలా వచ్చి పడ్డ వసూళ్లు 11 కోట్ల 80 లక్షల వరకూ ఉండడంతో అది కాస్తా ఆల్ టైమ్ రికార్డుగా నిలిచింది. గతంలో పుష్పకి వచ్చిన 11 కోట్ల ఫస్ట్ డే రెవిన్యూ రికార్డుగా ఉండగా దాన్ని అలవోకగా క్రాస్ చేసేసిన భీమ్లా నైజాం గడ్డపై కొత్త చరిత్ర లిఖించాడు. నిజానికి ఆంధ్రాలోనూ అదే జరిగేది అన్నీ అనుకూలంగా ఉండి ఉంటే.!
ఏదేమైనా ఇట్స్ పే బ్యాక్ టైమ్... ఈసారి గట్టిగా కొడుతున్నాం అంటూ ముందు నుంచీ చెబుతూ వచ్చిన నిర్మాత నాగ వంశీ కాన్ఫిడెన్స్ కరెక్టేనని ప్రూవ్ చేసింది భీమ్లా రిజల్ట్. అంతేకాదు.. మొన్నటివరకూ అభిమానులు అజ్ఞాతంగా అణుచుకుని ఉన్న ఆవేదన కూడా నిన్నటితో తీరిపోయింది. త్రివిక్రమ్ పట్ల పవన్ అభిమానుల అభిమానం పదింతలు పెరిగిపోయింది. మొత్తానికి సరైన సినిమా పడితే పవన్ పవర్ కి బాక్సాఫీస్ ఎలా అల్లాడిపోతోందో చెప్పడానికి తాజా నిదర్శనంగా నిలుస్తోంది భీమ్లా నాయక్ .!