భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ చిత్ర పరిశ్రమకు రాజకీయాలు ఇమడవు. ఇది కళాకారులు కలిసే ప్రాంతం. నిజమైన కళాకారుడికి, కులం, మతం, ప్రాంతం ఉండవు. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్థికి ఎందరో కృషి చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుగారి నాయకత్వంలో ఆ బంధం మరింత బలపడుతుంది. ఆయన అందిస్తున్న తోడ్పాటుకు ధన్యవాదాలు. చిత్ర పరిశ్రమకు ఏ అవసరమున్నా తలసాని శ్రీనివాస్ యాదవ్‌గారు నేనున్నాను అంటూ ముందుకొస్తారు. జన జీవితంలో ఉన్నప్పటికీ సినిమానే అన్నం పెట్టింది. సినిమా లేకపోతే ప్రజాసేవలో ఉండేవాడిని కాదు. సినిమా మాధ్యమం ఇంతమంది అభిమానులను నాకు భిక్షగా ఇచ్చింది. ఇంతమంది నన్ను గుండెల్లో పెట్టుకునేలా చేసింది. ఏదో అయిపోదామని ఎప్పుడూ అనుకోలేదు.
మన రాష్ట్రానికి, మనవాళ్లకు ఎంతో కొంత చేయాలని వచ్చా. రాజకీయాల్లో ఉన్నా కదాని, ఎలాగోలా సినిమా చేయలేదు. చాలా బాధ్యతతో సినిమాలు చేస్తున్నా. తొలిప్రేమ, ఖుషి చిత్రాలకు ఎలాంటి క్రమశిక్షణతో పనిచేశామో దీనికి అలాగే పనిచేశాం. అహంకారానికి, ఆత్మగౌరవానికి ఒక మడమ తిప్పని యుద్థం ఈ చిత్రం. ఒక పోలీస్ ఆఫీసర్‌కు, రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తికి మధ్య జరిగే సంఘర్షణ. తెలుగువారికి చేరువయ్యేలా తీర్చిదిద్దిన త్రివిక్రమ్‌గారికి థ్యాంక్స్. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. నా రాజకీయ షెడ్యూల్‌కు అనుగుణంగా నిర్మాతలు చిత్రానికి ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. ప్రతి టెక్నీషియన్ చాలా కష్టపడి పనిచేశారు. ఇప్పుడు పరిశ్రమలో యువశక్తి వస్తోంది. అందుకు ఉదాహరణ నల్గొండ నుంచి వచ్చిన తెలంగాణ యువకుడు సాగర్. అమెరికాలో చదువుకుంటూ సినిమాపై ప్రేమతో ఇక్కడకు వచ్చారు. పరిశ్రమలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆయన మరిన్ని విజయాలుని సాధించాలి. మొగిలయ్యలాంటి గాయకులను వెలుగులోకి తెచ్చిన తమన్‌కు ధన్యవాదాలు. . రానా, సంయుక్త మేనన్, నిత్యామేనన్ చక్కగా నటించారు. సినిమాకు పనిచేసిన అందరికీ కృతజ్ఞతలు అంటూ పవన్ మాట్లాడారు