పవన్ కళ్యాణ్ - దగ్గుబాటి రానాల భీమ్లా నాయక్ 25 న వస్తోన్న విషయం తెలిసిందే. అన్నిచోట్లా అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. కానీ నైజాంలో మాత్రం ఆన్ లైన్ టిక్కెటింగ్ లో ఏర్పడ్డ సమస్య కొంచెం గందరగోళాన్ని సృష్టించింది. ఫేమస్ పోర్టల్ బుక్ మై షోలో భీమ్లా నాయక్ టికెట్స్ బుకింగ్ అందుబాటులో లేకపోవడంతో అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేసారు.
పర్శంటేజ్ విషయంలో ఏకాభిప్రాయం కుదరక అటు బుక్ మై షో టీమ్ భీమ్లా టికెట్స్ ఆన్ లైన్ బుకింగ్ పెట్టేది లేదని పట్టుబడితే.. థియేటర్స్ వద్దనే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేస్తామంటూ నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు పంతానికి పోయారు. దాంతో సగటు సినీ అభిమానులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అది కాస్తా భీమ్లా ఓపెనింగ్ రెవిన్యూపై ప్రభావం చూపించేలా కనిపించింది.
మొత్తానికి నిన్నటివరకూ ఇలాగే కొనసాగిన ఈ తకరారు ఇరు వర్గాల చర్చలతో తీరిపోయిందని తెలుస్తోంది. కాగా నేటి ఉదయం నుంచీ బుక్ మై షో పోర్టల్ లో భీమ్లా హవా మొదలైంది.