వివాదాలను కోరి కొనితెచ్చుకోవడం.. ఎవ్వరి మీదైనా కయ్యానికి కాలు దువ్వడం కంగనా రనౌత్ శైలి. అస్సలు తనకు అక్కర్లేని అంశాలపై కూడా అవాకులు చెవాకులు పేలడానికి చెంగున దూకే కంగన సాటి నటీ నటుల పైనా విమర్శలు కురిపిస్తూనే ఉంటుందన్న విషయం తెలిసిందే. తాజాగా మరో కాంట్రవర్సీకి తెర తీసిన కంగన ఈమారు అలియా భట్ పై అక్కసును వెళ్లగక్కింది.
ఈ ఫ్రైడే బాలీవుడ్ లో రానున్న సినిమా తప్పకుండా అట్టర్ ప్లాప్ అవుతుందనీ, 200 కోట్ల నష్టం తధ్యమని జోస్యం చెప్పేస్తోన్న కంగన అందంగా ఉన్నానని భ్రమపడే అమ్మాయి బాగా నటిస్తానని అనిపించుకోవడం అసంభవం అంటోంది. ఆ సినిమాకి నటీ నటుల ఎంపికలోనే లోపం ఉందంటూ, ప్రేక్షకులు ఆ చిత్రాన్ని తిప్పి కొడతారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయింది.
అలియాభట్ ప్రధాన పాత్రధారిగా దిగ్దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తీసిన గంగూభాయ్ కతియావాడి ఈ శుక్రవారం విడుదలవుతోన్న నేపథ్యంలో కంగన కామెంట్స్ ఎవరి మీదనో స్పష్టంగా తెలిసిపోతోంది. ఇప్పటివరకూ అయితే ఇటు భన్సాలీ కానీ అటు అలియా కానీ కంగన ప్రేలాపనపై స్పందించలేదు. మరి కంగన కడుపు మంటపై అలియా నేరుగా రియాక్ట్ అవుతుందా.. లేక గంగూభాయ్ రిజల్టే సరైన సమాధానం అనుకుంటుందా వేచి చూద్దాం.!