దిగ్గజ గాయని లతా మంగేష్కర్ కన్నుమూసిన కొన్ని రోజులకే పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ కం గాయకుడు బప్పీ లహరి కన్నుమూయడం అందరిని శోక సంద్రంలో ముంచేసింది. గత కొన్ని రోజులుగా ఛాతీ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడిన బప్పీ లహరి జుహులోని క్రిటికేర్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆరోగ్యం కుదుటపడి ఫిబ్రవరి 15 న డిశ్చార్జ్ అయ్యారు. కానీ ఆ రోజే ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో క్రిటికేర్ ఆసుపత్రికి తరలించారు. కానీ బప్పీ లహరి మంగళవారం రాత్రి 11.45 గంటలకు మరణించారు. ఆయన మృతితో బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు, సంగీతాభిమానులు శోక సముద్రంలో మునిగిపోయారు.
డిస్కో కింగ్ గా పేరు తెచ్చుకున్న బప్పి లహరి మ్యూజిక్ అంటే సౌండ్ బాక్స్ లు దద్దరిల్లేవి. థియేటర్స్ లో కుర్రకారు కేరింతలు కొట్టేవారు. తెలుగులో బప్పి లహరి చాలా పెద్ద మ్యూజికల్ హిట్స్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు అలాగే బాలకృష్ణ తో రౌడి ఇన్స్పెక్టర్, నిప్పు రవ్వ, మోహన్ బాబు తో రౌడీ గారి పెళ్ళాం, బ్రహ్మ లాంటి పెద్ద సినిమాలని బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్స్ గా మలిచారు. తెలుగులో దాదాపుగా ఆయన 30 సినిమాలకి పైనే మ్యూజిక్ అందించారు. 1986 సంవత్సరం లో 33 సినిమాలకి మ్యూజిక్ చేసి.. దాదాపు 180 పాటలు రికార్డ్ చేసి గిన్నీస్ బుక్ అఫ్ రికార్డ్ లోకి ఎక్కిన ఘనత బప్పి లహరి సొంతం.
అలాంటి బప్పి లహరి ఈ రోజు మన మధ్యన లేరు అనే షాకింగ్ న్యూస్ ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. బప్పి లహరి మృతికి ప్రధాని మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మెగాస్టార్ చిరు, బాలకృష్ణ లాంటి ప్రముఖులు తమ సంతాపం తెలియజేసారు.