ఏపీ సీఎం జగన్ తో టాలీవుడ్ ప్రముఖుల సమావేశం ముగిసింది. ఈ రోజు ఉదయమే మెగాస్టార్ చిరు అధ్యక్షతన ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల, నిరంజన్ రెడ్డి లు వారి తో పాటుగా అలీ, ఆర్. నారాయణమూర్తి, పోసాని లు జగన్ ని కలిశారు. హైదరాబాద్ నుండి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న వీరు.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్‌కు చేరుకున్నారు. అనంతరం అక్కడ సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి పేర్ని నానితో ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జగన్ తో గంటన్నర పాటు జరిగిన ఈ మీటింగ్ విషయాలను.. ప్రతి ఒక్కరు మీడియా సమావేశంలో వివరించారు.
మెగాస్టార్ చిరు జగన్ తో భేటీ పై మట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీ సమస్యల పరిష్కారంపై సానుకూలంగా స్పందించారని, ఇండస్ట్రీ సమస్యలపై శుభం కార్డు పడింది అని చెప్పడానికి సంతోషిస్తున్నాము అని, చిన్న సినిమాలకు ఐదో ఆట కి అక్కడిక్కడే అనుమతినిచ్చారని, చిన్న సినిమాల నిర్మాతలకు మంచి వెసులుబాటు ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తెలుగు సినిమాల గురించి గొప్పగా ప్రచారం జరుగుతోందని చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో జగన్ గారికి కృతజ్ఞలు తెలుపుకుంటున్నాం అని, జగన్ తో చర్చలు సంతృప్తికరంగా సాగాయని, ఈ నెలాఖరు లోపల అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతూ జీవో విడుదలయ్యే అవకాశం ఉంది అని, ఈ మీటింగ్ విజయవంతమవ్వడానికి కారణమైన మంత్రి పేర్ని నాని కి చిరు కృతఙ్ఞతలు తెలిపారు.
మహేష్ బాబు మాట్లాడుతూ.. చిరంజీవి గారికి థాంక్స్ చెప్పుకోవాలి. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి చిరు ముందుండి నడిపించారు. సినీ పరిశ్రమ సమస్యలపై సానూకూలంగా స్పందించిన సీఎం జగన్ గారికి కృతఙ్ఞతలు తెలుపుతున్నామని, గత ఆరు నెలలుగా ఇండస్ట్రీ అంతా గందరగోళంగా ఉంది అని, ఈ సమస్యల పరిష్కారానికి చిరు గారు చేసిన కృషి ఎంతో ఉంది అని, ఓ వారం పది రోజుల్లో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అని ఆశిస్తున్నామని అన్నారు.
రాజమౌళి మాట్లాడుతూ.. సీఎం జగన్ గారికి ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలిపారు. చిరు ముందుండి ఈ సమస్యని పరిష్కరించడానికి ఎంతో కష్టపడ్డారని, ఆయన కాదన్నా ఆయనే సినిమా ఇండస్ట్రీ పెద్ద అని మరోసారి రుజువైంది అని, సీఎం జగన్ తో చిరంజీవి గారికున్న సాన్నిహిత్యంతోనే సమస్య పరిష్కారం అయ్యింది అని, పెద్ద సినిమాల విషయంలో ఐదారు నెలలుగా చాలా కంగారు పడుతున్నామని.. చిన్న, పెద్ద నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పుడు ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చినందుకు సంతోషకంగా ఉంది అన్నారు. మా విజ్ఞప్తులని జగన్ గారు విన్నారు అని మాట్లాడారు.
ప్రభాస్ మాట్లాడుతూ.. సీఎం జగన్ గారు మా పట్ల సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. అందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్న చిరంజీవికి ధన్యవాదాలు అని అన్నారు.
ఆర్. నారాయణ మూర్తి మట్లాడుతూ.. చిన్న సినిమాలకు అవకాశాలు లేకుండా పోతున్నాయి. చిన్న సినిమాలు బ్రతికేలా చేస్తామని జగన్ గారు హామీ ఇచ్చారు. చిరంజీవి గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు. ఇలానే చిరంజీవి గారు కేసీఆర్, జగన్ తో మాట్లాడి నంది అవార్డులు వచ్చేలా చూడండి, ఇండస్ట్రీని బ్రతికించండి అని చిరుకి కృతఙ్ఞతలు తెలిపారు.
ఇంకా మీడియా సమావేశంలో మంత్రి పేర్ని నాని తో పాటు హీరో ప్రభాస్ మాట్లాడారు.