మన తెలుగు సినిమాలు వెళ్లి నార్త్ లో కలెక్షన్లు కొల్లగొట్టేస్తుంటే... కన్ను కుట్టేసినట్టు ఉంది బాలీవుడ్ హీరోలకి. ఇక మీదట భారీ హిందీ సినిమాలన్నిటినీ దక్షిణాది భాషల్లోకి అనువదించి దింపాలనే నిర్ణయానికి వచ్చేసారు. అయితే హిందీ చిత్రాలు తెలుగులోకి డబ్ కావడం కొత్తేమి కాదు కానీ అంతకు ముందు అడపాదడపా మాత్రమే సాగిన ఆ తంతు ఇకపై ఉధృతంగా జరుగుతుందనే సంకేతాలు అందుతున్నాయి.
ఆలియాభట్ గంగూభాయ్ కతియవాడి, ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా, అజయ్ దేవగన్ మైదాన్, అక్షయ్ కుమార్ రామసేతు, హృతిక్ రోషన్-సైఫ్ ఆలీఖాన్ ల విక్రమ్ వేద, రణవీర్ సింగ్ సర్కస్, రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర వంటి సినిమాలను తెలుగుతో పాటు ఇతర సౌత్ లాంగ్వేజెస్ లోనూ డబ్ చేసి రిలీజ్ చేయనుంది బాలీవుడ్.
అంతేకాదు.. ఇకపై మొదలు కాబోయే సినిమాలను కూడా బాహుబలి చూపిన ఈ బాటలోకే తీసుకువస్తున్నారు బాలీవుడ్ బాబులు. అక్షయ్ కుమార్ - టైగర్ ష్రాఫ్ హీరోలుగా నేడు ఎనౌన్స్ చేసిన బడేమియా చోటేమియా మూవీని హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో అందిస్తామంటూ అధికారికంగా ప్రకటించారు. సరే.. ఇదే తరహా ప్రకటనలు ఇక ముందు కూడా వస్తూనే ఉంటాయి కానీ అక్కడివాళ్లు మన సినిమాలపై చూపిస్తున్నంత మక్కువ... మనవాళ్ళు హిందీ సినిమాలపై ప్రదర్శిస్తారా అన్నది సందేహమే. దేశవ్యాప్తంగా తెలుగు సినిమాని నెత్తిన పెట్టుకుంటున్నట్టు మన దక్షిణాది రాష్ట్రాలు కూడా హిందీ సినిమాలను అక్కున చేర్చుకుంటే భాషాభేదాలు చెరిగిపోయిన భారతీయ సినీ పరిశ్రమ వసుదైక కుటుంబంలా మారిపోతుంది.!