సిల్వర్ స్క్రీన్ పై అఖండ విజయం సాధించి ఆహా స్క్రీన్ పై అన్ స్టాపబుల్ హంగామా చేస్తోన్న బాలయ్య అటు ఎమ్మెల్యేగానూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చే ప్రక్రియను చేపట్టడం, ఆ మేరకు కొత్త జిల్లాలపై ప్రకటన జారీ చేయడం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రస్తుతం బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తోన్న హిందూపురం జిల్లాకు పుట్టపర్తిని ప్రధాన కేంద్రంగా ప్రకటించింది ప్రభుత్వం. అయితే ఆ అంశం పట్ల వెంటనే తన నిరసన తెలిపిన బాలయ్య నేడు నేరుగా హిందూపూర్ చేరుకొని మౌన దీక్షకు దిగారు. తనకు ఘన స్వాగతం పలికిన పార్టీ కార్యకర్తలు, స్థానిక నేతలు, అభిమానులతో పొట్టి శ్రీరాములు కూడలి నుంచి అంభేద్కర్ సర్కిల్ వరకూ ర్యాలీ నిర్వహించిన బాలయ్య ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని, అన్ని అర్హతలూ ఉన్న హిందూపురాన్నే జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేసారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓవైపు ఈ ప్రభుత్వ నిర్ణయాల పట్ల ఉద్యోగులు ఎంతగా ఆందోళన చేస్తున్నారో చూస్తున్నాం. దాన్నుంచి జనం దృష్టి మళ్లించేందుకే రాత్రికి రాత్రి కొత్త జిల్లాల ప్రకటన తెచ్చారు. స్వతహాగా నేను మన ప్రాంతం మన రాష్ట్రం బాగుండాలని కోరుకునే వ్యక్తిని. హిందూపురం విషయంలో పట్టు వదిలేది లేదు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా నిర్ణయించేంతవరకు ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయి. దేనికైనా నేను సిద్దమే. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసేస్తాను అన్నారు.