2020 మార్చినుంచీ కరోనా సృష్టిస్తోన్న కల్లోలం అందరికీ తెలిసిందే. లాక్ డౌన్ లూ, నైట్ కర్ఫ్యూలు, యాభై శాతం అక్యుపెన్సీలు, టికెట్ రేట్లు ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటోంది చిత్ర పరిశ్రమ. అయితే వీటన్నిటికీ తను అతీతం అన్నట్టు డైరెక్ట్ గా ఓటీటీ రిలీజుకి వెళ్లిపోయిన తమిళ్ హీరో సూర్య ఒకటి కాదు... బ్యాక్ టు బ్యాక్ రెండు సూపర్ హిట్లు కొట్టాడు. అన్ని భాషల ఆడియో స్ట్రీమింగ్ నీ అందుబాటులో ఉంచడంతో సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్ చిత్రాలు దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందాయి. బేసిక్ గా స్టార్ ఇమేజ్ కీ - హీరోయిజానికీ కాకుండా కథకీ - క్యారెక్టర్ కీ మాత్రమే విలువిచ్చే సూర్య ఆ పద్దతికి లభిస్తోన్న ప్రశంసల్ని ఆస్వాదిస్తూ తనదైన శైలిలో తదుపరి చిత్రాలను ప్లాన్ చేసుకుంటున్నారు. అవేంటో ఒకసారి పరిశీలిస్తే...
పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య చేసిన ఎత్తరుక్కుమ్ తునిందవన్ (E T) అనే తమిళ చిత్రం మార్చి 4 న కానీ, 10 న కానీ థియేటర్స్ లో విడుదల కానుంది. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత బిగ్ స్క్రీన్ పై సూర్య కనిపించనున్న సినిమా ఇదే. దీని తర్వాత నేషనల్ అవార్డు విన్నర్ బాల డైరెక్షన్ లో ఓ విభిన్నమైన చిత్రం చేస్తున్నారు సూర్య. ఆపై మరో నేషనల్ అవార్డు విన్నర్ వెట్రిమారన్ తో సినిమా ఉంది. ఆ నెక్స్ట్ ఆకాశం నీ హద్దురా దర్శకురాలు సుధా కొంగర ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ అయింది. అలాగే కోలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ లోకేష్ కనగరాజ్ తో సూర్య చేయనున్న ప్రాజెక్ట్ చర్చల దశలో ఉంది. ఇలా మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ ని ఏరి కోరి ఎంచుకుంటూ... తన సినిమాలన్నీ దేనికదే డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటోన్న సూర్య ప్లానింగ్ కి వాట్ ఏ లైన్ అప్ సర్ జీ అనకుండా ఉండగలమా..!