టాలీవుడ్ లో ఇప్పుడు దర్శకులు ఎక్కువగా పీరియడ్ డ్రామాల మీద మక్కువ చూపిస్తున్నారు. ట్రిపిల్ ఆర్ ప్రభావమో ఏంటో మరి, ఎందుకంటే ఆ సినిమా ఎప్పుడో స్వాతంత్రం రాకముందు జరిగిన కథ. ఈమధ్య విడుదల అయిన శ్యామ్ సింగ రాయ్ కానీయండి లేదా పుష్ప అయినా ఈ పీరియడ్ డ్రామా అనే చెప్పవచ్చు. అలాగే రాబోవు చాలా సినిమాలు కూడా ఈ పీరియడ్ డ్రామా సినిమాలే. నాని షూటింగ్ చేస్తున్న దసరా కూడా పీరియడ్ డ్రామా. ముప్పయి ఏళ్ళ క్రితం గోదావరి ఖని దగ్గర ఒక వూర్లో జరిగిన కథ. ముఖ్యంగా ధనిక, పేద, అంటరానితనం ఈ నేపధ్యం లో వస్తున్న సినిమా దసరా. అలాగే రవి తేజ టైగర్ నాగేశ్వర రావు కూడా చాలా దశాబ్దాల కిందట జరిగిన కథ.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా కూడా పీరియడ్ డ్రామానే. ఎప్పుడో నాలుగు దశాబ్దాల కిందట జరిగిన కథ అని తెలుస్తోంది. అలాగే ధనుష్ - వెంకీ అట్లూరి కలిపి చేస్తున్న సినిమా సర్ కూడా ఒక పీరియడ్ డ్రామానే. అది కూడా మూడు దశాబ్దాల కిందట జరిగిన కథ. ఎడ్యుకేషన్ సిస్టం మీద వస్తున్నకథ. ప్రైవేట్ కాలేజీలు మొత్తం ఎడ్యుకేషన్ ని తమ చేతుల్లోకి తీసుకున్నాయన్న కాన్సెప్ట్ ఆధారంగా వస్తున్న సినిమా అది. ప్రభాస్ రాధే శ్యామ్ కూడా పీరియడ్ డ్రామానే. అప్పుడెప్పుడో జరిగింది అని చెప్తున్న ప్రేమ కథ. అలాగే పవన్ కళ్యాణ్ దర్శకుడు క్రిష్ చేస్తున్న హరిహర వీరమల్లు కూడా పీరియడ్ డ్రామానే, ఎప్పుడో ఎక్కడో జరిగిన కథ అంటున్నారు.
దర్శకుడు రాహుల్ రవీంద్రన్ - రష్మీ మందన్న తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే, ఇది కూడా పీరియడ్ డ్రామా నే. మాజీ ప్రధాని పీ వీ నరసింహారావు గారు ప్రవేశ పెట్టిన ఆర్ధిక సంస్కరణల ఆధారంగా వస్తున్న సినిమా. ఇంకో విచిత్రం ఏంటంటే, ఇందులో చాలామట్టుకు కథలు ఆంధ్ర ప్రదేశ్ విభజన జరగక ముందు జరిగిన కథలు.