అదేంటో.. ఈ సినిమాకి ఏది కలిసి రావడం లేదు. ఎప్పుడో పూర్తవ్వాల్సిన షూటింగ్ రీ షూట్ల పర్వంతో కొనసా.......గుతూ జరిగింది. ఎన్నడో అనుకున్న విడుదల తేదీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. టైటిల్ లో ఉన్న లక్ ప్రాజెక్ట్ లో లేదే అనిపించుకుంటోన్న గుడ్ లక్ సఖి మొత్తానికి జనవరి 28 న బయటపడేందుకు అవకాశాలు కనిపించాయి. కానీ సందు దొరికిందని సడెన్ గా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడంతో సరైన పబ్లిసిటీ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా గ్రాండ్ గా చేసి సినిమాకి కాస్త బజ్ క్రియేట్ చేస్తే ఎంతో కొంత ఓపెనింగ్స్ వస్తాయని ఆశించిన మేకర్స్ మెగాస్టార్ ఛీఫ్ గెస్ట్ గా ఫంక్షన్ ప్లాన్ చేసారు. జనవరి 26 సాయంత్రం 6 గంటలకి హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో కార్యక్రమ నిర్వహణకై అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి.
బట్ అన్నీ అనుకున్నట్టు జరిగితే అది గుడ్ లక్ సఖి ఎందుకవుతుంది అన్నట్లు అనూహ్యంగా మరో మెగా స్ట్రోక్ తగిలింది. భోళాశంకర్ లో తన చెల్లెలిగా చేస్తోన్న కీర్తి సురేష్ కి గుడ్ లక్ చెప్పి బ్లెస్స్ చేద్దాం అనుకున్న చిరంజీవి అకస్మాత్తుగా కరోనా బారిన పడ్డారు. చిరు ఛీఫ్ గెస్ట్ గా వస్తున్నారు కనుక ప్రోగ్రాం సూపర్ సక్సెస్ అనుకున్న చిత్రబృందం ఇప్పుడు కలవరపడుతున్నారు. ఈవెంట్ అయితే ఎలాగో ఒకలా జరిపించేస్తారు కానీ అడుగడుగునా ఇలా అడ్డంకులు ఎదుర్కుంటున్న ఈ సఖికి గుడ్ లక్ అనేది ఉందా... గుడ్ రిజల్ట్ అందుతుందా అనేది మరో రెండు రోజుల్లో తేలిపోతుంది. ఆ సినిమా కాన్సెప్ట్ లాగానే అందరితోనూ అన్నిరకాలుగా బ్యాడ్ లక్ అనిపించుకుని ఫైనల్ గా ఆత్మవిశ్వాసంతో విజయం పొందినట్టు సినిమా ఫలితమూ సాధ్యమవునా సఖీ...!!