కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బతగలడమటుంచి.. సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో తెగ తర్జన భర్జనలు పడాల్సి వస్తుంది. కరోనా శాంతించింది కదా అని వరసబెట్టి రిలీజ్ డేట్స్ ఇచ్చేస్తుంటే.. మరోసారి మహమ్మారి రిలీజ్ డేట్స్ ని అతలాకుతలం చేస్తుంది. ఇప్పటికి మూడుసార్లు అలాగే జరిగింది. షూటింగ్స్ ఫినిష్ అయ్యి విడుదలకు రెడీగా ఉన్న సినిమాలు బోలెడన్ని. అవన్నీ వారానికి ఒకటి థియేటర్స్ లోకి దింపినా మూడునెలల పాటు థియేటర్స్ లో ఖాళీ ఉండదు. ఇక జనవరి నెలలో రిలీజ్ కి రెడీ అయిన పెద్ద సినిమాలన్నీ వరసగా వాయిదాలు పడ్డాయి. మరి ఫిబ్రవరి సినిమాల పరిస్థితి ఏమిటో అనేది సస్పెన్స్ గా మారింది.
ఇప్పటికే ఫిబ్రవరి 4 న రావాల్సిన ఆచార్య ఏప్రిల్ 1 కి వెళ్ళింది. ఇక 11 న రిలీజ్ కి సిద్దమవుతున్న ఖిలాడీ పరిస్థితి ఏమిటో తెలియడం లేదు కానీ.. ప్రమోషన్స్ ఆపలేదు. మరోపక్క ఫిబ్రవరి 25 న రావాల్సిన పవన్ కళ్యాణ్ బీమ్లా నాయక్ పరిస్థితి కూడా తెలియడం లేదు. ఏపీ థియేటర్స్ లో 50 శాతం ఆక్యుపెన్సీ నడుస్తుంది. అలాగే టికెట్ రేట్స్ ఇష్యు ఉంది. ఇలాంటి నేపథ్యంలో వచ్చే నెలలో విడుదల కావాల్సిన సినిమాలు అనుకున్న టైం కి అనుకున్నట్టుగా థియేటర్స్ లోకి వస్తాయో.. లేదంటే లాస్ట్ మినిట్ లో పోస్ట్ పోన్ అంటాయో చూడాలి.