ప్రతిభ ఎక్కడ ఉన్నా ఠక్కుమని అక్కున చేర్చుకునే సినీ పరిశ్రమ భాషా బేధాల హద్దులనీ, ప్రాంతీయ బేధాల సరిహద్దులనీ ఎప్పుడో చెరిపేసింది. ముఖ్యంగా మన తెలుగు సినిమాల్లో అయితే హిందీ, తమిళ, మలయాళ, కన్నడ పరిశ్రమలకు చెందిన వారిని తరచుగా చూస్తూనే ఉంటాం. నటీనటులనే కాదు, సాంకేతిక నిపుణుల్ని కూడా.! అయితే ఒకప్పుడు హిందీ హీరోయిన్లను.. అక్కడి విలన్లను తెగ తెచ్చేసిన మన తెలుగు పరిశ్రమ ప్రస్తుతం మాత్రం కేరళపైన ఎక్కువ కేర్ చూపిస్తోంది. అందుకేనేమో మన సినిమాల్లో మళయాళీల హవా ఒక రేంజ్ లో ఉందిప్పుడు.
జనతా గ్యారేజ్ లో జనాన్ని ఆకట్టుకున్న మోహన్ లాల్, యాత్రలోని పాత్రకి ప్రాణం పోసిన మమ్ముట్టి, అల వైకుంఠపురంలో రోల్ ని జస్టిఫై చేసిన జయరాం, మహానటితో ఓకే బంగారం అనిపించుకున్న దుల్కర్ సాల్మన్, పుష్పతో ఫైట్ కి సిద్ధపడ్డ ఫహద్ ఫాజిల్... ఇలా కేరళ స్టార్స్ అందరూ తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోన్న దశలో అదే రూట్ లోకి తనూ వస్తా అంటున్నాడు మరో మలయాళీ యువ నటుడు రోషన్ మాథ్యూ. కరోనా ఫస్ట్ వేవ్ టైం లో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన మలయాళ చిత్రం కప్పేలతో నటుడిగా మంచి గుర్తింపు పొందాడు రోషన్ మాథ్యూ. ఆ గుర్తింపే అతనికి ఇపుడు మన తెలుగు నుంచి పిలుపుని పంపింది. నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ చేస్తోన్న దసరా మూవీలో ఒక కీ రోల్ కి ఎంపికయ్యాడు రోషన్. మరి ప్రతిభకు లోటు లేని ఈ యువ నటుడి కెరీర్ మన తెలుగునాట ఎంతగా ప్రకాశిస్తుందో చూడాలి.!