కరోనా మూడో దశ కూడా ఎంతటి కల్లోలం రేపుతోందో అందరికీ తెలిసిందే. మిగతా రంగాలపై దాని ప్రభావం ఎంత ఉన్నప్పటికీ సినిమా రంగంపై మాత్రం మరింత ఎక్కువ ఉందని చెప్పాలి. భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో తెరకెక్కిన బహు భారీ చిత్రాలన్నీ విడుదలకు నోచుకోలేక బావురుమంటున్నాయి. గత కొన్ని నెలలుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ, వడ్డీలకి వడ్డీలు కడుతూ సరైన విడుదల తేదీ కోసం వేచి చూస్తోన్న ఈ బిగ్ బడ్జెట్ మూవీస్ అన్నిటికీ రాబోయే మార్చి నెల నుంచీ కాస్త ఉపశమనం లభిస్తుందనీ, థియేటర్ల తలుపు తట్టే వీలు చిక్కుతుందనీ అంటున్నారు అటు ఆరోగ్య శాస్త్ర నిపుణులు.. ఇటు సినీ రంగ విశ్లేషకులు. అయితే ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. అదేమిటంటే....
అదను చూసుకుని రంగంలోకి దూకేద్దామనుకునే ఆర్.ఆర్.ఆర్. వంటి చిత్రాలు రెండు, మూడు డేట్స్ ఆప్షన్స్ గా పెట్టుకుంటూ వుంటే.. తాము ముందే ప్రకటించిన డేట్స్ పట్ల తగ్గేదేలే అంటున్నాయి మరికొన్ని భారీ చిత్రాలు. అయితే మన ఆర్.ఆర్.ఆర్., రాధే శ్యామ్, ఆచార్య, బీమ్లా నాయక్, సర్కారు వారి పాట, ఎఫ్ ౩ వంటి సినిమాల విడుదల విషయంలో సమన్వయం కుదిరే అవకాశాలు ఉన్నాయి కానీ మనవి కానీ మరో మూడు భారీ చిత్రాలు మాత్రం ఒకే రోజున బాక్సాఫీస్ బరిలో యుద్దానికి సిద్ధం అంటున్నాయి. ఆ రోజు ఏప్రిల్ 14 .. ఆ సినిమాలు కె.జి.ఎఫ్.2 , లాల్ సింగ్ చద్దా, బీస్ట్.
ఎన్నో అంచనాలు ఉన్న కన్నడ సెన్సేషన్ కె.జి.ఎఫ్.2 , ఎంతో పర్ఫెక్షనిస్ట్ అనిపించుకునే ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమాలు ఎప్పుడో ఏప్రిల్ 14 ని రిలీజ్ డేట్ గా లాక్ చేసుకుంటే... సంక్రాంతికి రావాల్సి, రాలేకపోయిన తన బీస్ట్ సినిమాని సడెన్ గా ఏప్రిల్ 14 కి ఫిక్స్ చేసాడట ఇళయ దళపతి విజయ్. మరిలా ఒకే రోజు మూడు భారీ సినిమాలు బరిలోకి దిగితే బాక్స్ ఆఫీస్ కళకళలాడడం ఖాయమే కానీ ఏ సినిమా ప్రభావం ఏ సినిమాపై పడుతుందన్నది వేచి చూడాలి. అసలు అంతకుముందు ఈ కరోనా మనల్ని అప్పటికైనా కనికరిస్తుందని ఆశించాలి.!