యాక్షన్ హీరో విశాల్ లేటెస్ట్ మూవీ సామాన్యుడు విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాతో తు ప శరవణన్ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ యాక్షన్ డ్రామాకు నాట్ ఏ కామన్ మ్యాన్ అనేది ట్యాగ్‌లైన్. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన రావడంతో తెలుగు, తమిళ భాషల్లో సినిమా మీద అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది.
టైటిల్‌కు తగ్గట్టు సినిమాలో విశాల్ కామన్ మ్యాన్‌గా కనిపించబోతోన్నారు. ఒక క్రైమ్ కథను వివరిస్తూ విశాల్ పాత్ర ఇంట్రడక్షన్ అద్భుతంగా ఉంది. ఒక ఇంట్లో రెండు శవాలున్నాయి. ఒకదానికి ప్రాణం ఉంది. ఇంకోదానికి ప్రాణం లేదు. ఆ ప్రాణమున్న శవం.. ప్రాణం లేని శవాన్ని చంపేసింది. తన ప్రాణాలు కాపాడుకునేందుకు వేరే దారిలేక హత్య చేసేవాడికి, మిగతా వాళ్లను చంపి తను బతకాలని అనుకునేవాడికి చాలా తేడా ఉంది. ఒక నేరాన్ని కనిపెట్టడం కంటే.. దాన్ని ఏ యాంగిల్‌లో చూస్తున్నామన్నదే.. ఓ మంచి పోలీస్ ఆఫీసర్‌కు ఉండే ముఖ్యమైన అర్హత అని నేను అనుకుంటున్నాను అనే డైలాగ్ సినిమా నేపథ్యం ఏంటో చెబుతోంది.
ట్రైలర్‌ను బట్టి చూస్తే ఫుల్ యాక్షన్ మోడ్‌లో సినిమా ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. డింపుల్ హయతి, విశాల్ లవ్ స్టోరీ, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ యూత్ ఆడియెన్స్‌ను కట్టిపడేసేలా ఉంది. ఇందులో అద్బుతమైన డైలాగ్స్, పవర్ ప్యాక్డ్ యాక్షన్ పర్ఫామెన్స్‌తో విశాల్ అందరినీ ఆకట్టుకున్నారు. ఇక సాంకేతికంగానూ ట్రైలర్ ఉన్నతంగా ఉంది. కెవిన్ రాజ్ సినిమాటోగ్రఫీ, యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్బుతంగా కుదిరాయి.