ప్రస్తుతం ఏపీలో సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఘోరంగా తయారైంది. వైసిపి ప్రభుత్వంలో ఒక్క యాక్టర్ కూడా లేకపోవడంతో ఏపీలో వైసీపీ ప్రభుత్వం టాలీవుడ్ ని చిన్న చూపు చూస్తుంది. టీడీపీలో బాలకృష్ణ, జనసేనలో పవన్ ఉన్నారు. వైసిపిలో రోజా ఉన్నా ఆమె సినిమాలకు దూరంగా ఉంటుంది. అందుకే మేం ఏం చేసినా, ఏం మాట్లాడినా చెల్లుతుంది అంటూ ఏపీ మంత్రులు సినిమా వాళ్లపై నోరు పారేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ టికెట్ రేట్స్ విషయమై ప్రశ్నించాడని ఏపీ మంత్రులు మందలు మందలుగా పవన్ ని తిట్టిపోశారు. నిన్న ఓ ప్రెస్ మీట్ లో హీరో నాని.. థియేటర్స్ కన్నా కిరాణా షాపులకే లాభాలొస్తున్నాయి, టికెట్ రేట్స్ తగ్గించి ఏపీ ప్రభుత్వం ఆడియన్స్ ని అవమానించింది అంటూ అలా మాట్లాడాడో.. లేదో.. ఇలా ఏపీ మంత్రులు నాని పై పడిపోయారు.
ఒక మంత్రి మాట్లాడుతూ ఏపీలో షూటింగ్స్ చెయ్యరు.. వారికి మాట్లాడే హక్కు లేదంటాడు. మరో మంత్రి కిరాణా కొట్టంటే అంతా చీపా అంటాడు. ఇక ఒక మంత్రిగారైతే.. హీరో నాని ఎవరో తెలియదు. మాకు మా కొడాలి నాని తప్ప అంటాడు. ఒకప్పుడు నేనూ పవన్ ఫ్యాన్ నే.. పవన్ కటౌట్ కట్టడానికి బైక్ అమ్మేసాను.. అన్ని వదలగొట్టుకున్నాను. ఇండస్ట్రీని ప్రజలని ఉద్దరించాలంటే హీరోలు రెన్యుమరేషన్ తగ్గించుకోండి అంటూ సలహాలు ఇస్తూ నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు.
మరోపక్క విజిలెన్స్ అధికారులు థియేటర్స్ పై దాడులు చేస్తూ థియేటర్స్ ని సీజ్ చేస్తున్నారు. ఇక ఏపీలో థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ చేస్తే ఎదురు పెట్టుబడి పెట్టే పరిస్తితికి ఏపీ ప్రభుత్వ తీసుకు వచ్చింది. ఇంత జరుగుతున్నా స్టార్ హీరోలు కానీ బడా నిర్మాతలు కానీ ఒక్క మాటా మట్లాడడం లేదు.. నోరు విప్పి విమర్శలు చేస్తే.. తమ పైకి ఎక్కడ వస్తుంది అని అనుకుంటున్నారో.. లేదంటే మరింతగా నష్టపోతాం అనుకుంటున్నారో కానీ.. ఒక్కరూ నానికి, పవన్ కి సపోర్ట్ గా మాట్లాడడం లేదు. ఒకవేళ స్టార్ హీరోలు కలిసికట్టుగా వచ్చి ఏపీ ప్రభుత్వంపైకి వెళ్లినా.. ఇంతకన్నా ఏపీ ప్రభుత్వం ఇండస్ట్రీని ఏమి చెయ్యలేదు.. అంటే ఇండస్ట్రీ నష్టపోయే నిర్ణయాలు తీసుకోవడానికి ఇంతకు మించి ఇంకేం ఉంటాయి.
మరి ఇప్పటికైనా స్టార్ హీరోలు, బడా నిర్మాతలు కలిసి నిర్ణయం తీసుకుని ఏపీ ప్రభుత్వంతో మాట్లాడితే పని జరుగుతుంది. లేదంటే ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ ని మరింతగా తొక్కేయ్యడం ఖాయం.. స్టార్ హీరోలు సినిమాల ప్రమోషన్స్ మాత్రమేనా.. ఇదేం మీకు పట్టదా అంటూ హీరోలపై నెటిజెన్స్ సెటైర్స్ వేస్తున్నారు. ముఖ్యంగా రేపు రిలీజ్ కాబోతున్న ఆర్.ఆర్.ఆర్ హీరోలు, రాధేశ్యామ్ ప్రభాస్.. మీరైనా పెదవి విప్పి మట్లాడండి సామి అంటున్నారు నెటిజెన్స్.