పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే లో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సంక్రాంతికి రాబోతున్న భీమ్లా నాయక్ షూటింగ్ చివరి దశలో ఉంది. భీమ్లా నాయక్ నుండి ఏ చిన్నపాటి అప్ డేట్ అయినా సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవడంతో.. భీమ్లా నాయక్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రీసెంట్ గా రానా డ్యానియల్ శేఖర్ టీజర్ తో ఆ అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ గా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుంటే.. రానా ఈగో పర్సన్ గా పవన్ తో వైరం పెట్టుకున్న వ్యక్తిగా కనిపిస్తున్నాడు.
నిన్నమొన్నటివరకు ఏపీ రాజకీయాల్లో కొద్దిగా బిజీగా వున్న పవన్ మళ్ళీ భీమ్లా నాయక్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం భీమ్లా నాయక్ కొత్త షెడ్యూల్ ఈ శుక్రవారం వికారాబాద్ ఫారెస్ట్ లో మొదలయ్యింది. వికారాబాద్ లో భీమ్లా నాయక్ యాక్షన్ సన్నివేశాలను షూట్ చెయ్యబోతున్నారు. ఇక వికారాబాద్ కి పవన్ భీమ్లా నాయక్ షూటింగ్ కి వస్తున్నాడనగానే.. పవన్ కళ్యాణ్ ని చూసేందుకు అక్కడికి భారీగా జనం పొగవడమే కాదు.. పవన్‌కల్యాణ్.. పవన్‌కల్యాణ్ అంటూ అరుస్తూ జాతరను తలపింప చేసారు. దానితో పాన్ కళ్యాణ్ కారులో ఉన్నవాడు కాస్తా.. కారు నుండి బయటకి వచ్చి అభిమానులకి అభివాదం చెయ్యడం ఆకట్టుకుంది. భీమ్లా నాయక్ షూటింగ్ లొకేషన్స్ దగ్గరకి భారీ ఎత్తున జనం పొగవడంతో అక్కడ ఏదైనా జాతర గాని జరుగుతుందా అనిపించేంత సందడి నెలకొంది. ఇక భీమ్లా నాయక్ జనవరి 12 నే అంటూ మేకర్స్ ఘంటా బనాయించి చెబుతున్నారు.