మెగాస్టార్ చిరంజీవి.. యంగ్ హీరోలకి పోటీ ఇవ్వడం కాదు.. అంతకు మించి అన్నట్టుగా వరస ప్రాజెక్ట్స్ తో అదరగొట్టేస్తున్నారు. ఇప్పటికే నాలుగు సినిమాల షూటింగ్స్ తో డిసెంబర్ లో రికార్డ్ క్రియేట్ చేసిన చిరు తన తదుపరి మూవీని ఎనౌన్స్ చేసి షాకిచ్చారు. ఆచార్య షూటింగ్ చివరి దశలో ఉండగా.. గాడ్ ఫాదర్, భోళా శంకర్, బాబీ తో వాల్తేరు వీరయ్య మూవీ షూటింగ్స్ ని ఒకేసారి చేస్తూ చిరు షాకివ్వడమే కాదు.. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ అంటూ మరింత షాకిచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో మరో చిత్రానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించబోయే ఈ భారీ బడ్జెట్ చిత్రానికి భీష్మ తో భారీ హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుమల డైరెక్టర్. RRR వంటి భారీ పాన్ ఇండియా మూవీని నిర్మించిన తర్వాత డివివి దానయ్య నిర్మిస్తోన్న మరో భారీ చిత్రమిది. డాక్టర్ మాధవి రాజు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా..
నిర్మాత డివివి దానయ్య మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవిగారితో సినిమా చేయాలని ప్రతి నిర్మాతకు కోరిక ఉంటుంది. అలాగే నేను కోరుకున్నాను. నా బలమైన కోరికకు మరో బలం తోడైంది. అదే దర్శకుడు వెంకీ కుడుముల ఎందుకంటే ఛలో, భీష్మ వంటి వరుస విజయాలను సాధించిన దర్శకుడు వెంకీ కుడుముల మెగాస్టార్ చిరంజీవికి పెద్ద అభిమాని. దర్శకుడిగా చిరంజీవితో సినిమా చేయాలనేది ఆయన డ్రీమ్. ఆయన చెప్పిన కథ నచ్చింది. మెగాభిమానులను ఎంటర్‌టైన్ చేసే పక్కా కమర్షియల్ మూవీ ఇది. త్వరలోనే ఇందులో ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను తెలియజేస్తాం అన్నారు.