ఏపీ ప్రభుత్వం.. సినిమా ఇండస్ట్రీని తొక్కేస్తూ.. టికెట్ రేట్స్ తగ్గించి జీవో తీసుకురావడం పై టాలీవుడ్ కక్కలేక మింగలేక ఉండిపోయింది. ఎందుకంటే భారీ బడ్జెట్ సినిమాలకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ రేట్స్ తో నష్టాలు తప్ప, లాభాలు రావు. అద్భుతమైన హిట్ అయిన సినిమాలు కూడా ఏపీ లో బ్రేక్ ఈవెన్ సాధించలేవు.. దానికి ప్రత్యక్ష ఉదాహరణ.. బాలకృష్ణ అఖండనే. అఖండ మూవీకి అద్భుతమైన టాక్, అదిరిపోయే రెస్పాన్స్ వచ్చినా.. ఏపీలో చాలా ఏరియాలలో ఇంకా బ్రేక్ ఈవెన్ కి చేరుకోలేదు.. రేపటినుండి బిగ్ మూవీస్, పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఏపీ ప్రభుత్వంతో మీటింగ్స్ పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కానీ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ థియేటర్ల యాజమాన్యాలు ఏపీ హైకోర్టును ఆశ్రయించాయి. ఆర్.ఆర్.ఆర్ నిర్మాత దానయ్య లాంటి వాళ్ళు టికెట్ రేట్స్ పెంచకపోతే కష్టమని ప్రెస్ మీట్స్ లో మాట్లాడుతున్నారు. మెగాస్టార్, రాఘవేంద్రుడు లాంటి వాళ్ళు ట్వీట్స్ చేస్తున్నా ఏపీ ప్రభుత్వం దిగిరాలేదు.
అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం, తగ్గించిన టికెట్ రేట్స్ విషయంలో ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అందులో భాగంగా ఏపీలో టిక్కెట్స్ రేట్స్ తగ్గిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సస్పెండ్ చేసింది హైకోర్టు. ఏపీలో టికెట్ రేట్స్ పెంచుకోవచ్చని డిస్ట్రిబ్యూటర్స్ కి అనుకూలంగా తీర్పునిచ్చింది. పాత టికెట్ ధరలతోనే సినిమాలను రిలీజ్ చేసుకోవచ్చని ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటి తీర్పు ఇవ్వడంతో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ సంబరాల్లో మునిగిపోయింది. ఇక రేపటినుండి విడుదల కాబోయే సినిమాలకు ఈ తీర్పు బలాన్నిచ్చింది.