ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు, నెల్లూరు జిల్లాలు భారీ వర్షాలకు అతలాకుతలం అవుతున్నాయి. తిరుపతి అయితే భారీ వర్షాలతో చిగురుటాకులా వణికిపోయింది. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యవసర క్యాబినెట్ సమావేశం నిర్వహించడంతో.. భారీ వర్షాలపై సమీక్ష నిర్వహిస్తుంది అనుకుంటే.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ కేబినెట్ సమావేశంలో మూడు రాజధానుల బిల్లు పై సంచలన నిర్ణయం తీసుకున్నారు. విశాఖ, కర్నూల్, అమరావతి ఇలా మూడు రాజధానుల ప్రతిపాదన విషయంలో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర హైకోర్టులో కొద్ది సేపటి క్రితం, హైకోర్టులో రాజధాని అమరావతి కేసు విచారణకు రాగానే ప్రభుత్వ తరుపు న్యాయవాది మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకుంటున్నామని సంచలన ప్రకటన చేసారు. నిన్నటి వరకు రాజధాని రైతులు తరుపున న్యాయవాది తమ వాదనలు వినిపించారు.
ఈ రోజు రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ శ్రీరాం త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణ ప్రారంభం అవుతూ ఉండటంతోనే.. ఆయన రాష్ట్ర హైకోర్టులో ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకుంటున్నామని, దీని పైన ముఖ్యమంత్రి అసెంబ్లీలో కీలక ప్రకటన చేయబోతున్నారని చెప్పారు. అయితే ఈ మూడు రాజధానుల బిల్లు స్టేట్మెంట్ విషయం పై స్పష్టత లేకపోవటంతో కోర్టు మరోసారి ప్రశ్నించింది. దానితో మరోసారి అడ్వొకేట్ జనరల్ చెప్తూ.. మూడు రాజధానుల బిల్లు ఏదైతే ఉందో, సిఆర్డీఏ రద్దు చేయటం, ఈ రెండు బిల్లులు కూడా ప్రభుత్వం వెనక్కు తీసుకుంటుందని, ఏపీ ప్రభుత్వం ఈ విషయంపై అసెంబ్లీలో స్పష్టత ఇస్తుందని కోర్టుకి చెప్పారు.