ఏపీ అసెంబ్లీలో టీడీపీ అధ్యక్షుడు, నారా చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరిపై వైసిపి మంత్రులు చేసిన వ్యాఖ్యల ఫలితంగా చంద్రబాబు కంట తడి పెట్టుకోవడమే కాదు.. నందమూరి ఫ్యామిలీ మొత్తం భువనేశ్వరికి అండగా.. ఆమె పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బాలకృష్ణ అధ్యక్షతన ప్రెస్ మీట్ పెట్టి.. వైసిపి మంత్రులని హెచ్చరించారు. ఇక నటుడు కళ్యాణ్ రామ్.. సోషల్ మీడియా ద్వారా ఈ విషయమై స్పందించగా.. అందరూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ రియాక్షన్ కోసం ఎదురు చూసారు. ఎందుకంటే వైసిపిలో కొడాలి నాని కి ఎన్టీఆర్ కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ స్విజ్జర్ లాండ్ టూర్ నుండి రాగానే విషయం తెలుసుకుని ఓ వీడియో ద్వారా తన స్పందనని తెలియజేసాడు.
మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. ఆ విమర్శలు, ప్రతి విమర్శలు ప్రజా సమస్యలపైనే జరగాలి కానీ.. వ్యక్తిగత దూషణలు లేదా వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు. నిన్న అసెంబ్లీలో జరిగిన ఓ సంఘటన నా మనసుని కలిచివేసింది. ఇప్పుడైతే మనం ప్రజా సమస్యలను పక్కనబెట్టి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు.ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పురుష పదజాలంతో మాట్లాడుతున్నారు. అది ఒక అరాచక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది. స్త్రీ జాతిని, ఆడపడుచులని గౌరవించడం అనేది మన సంస్కృతి. మన నవనాడుల్లో, మన రక్తంలో ఇమిడిపోయిన మన సంప్రదాయం. మన సంప్రదాయాన్ని రాబోయే తరానికి చాలా భద్రంగా జాగ్రత్తగా అప్పజెప్పాలి కానీ, మన సంస్కృతిని కలిచివేసి, కాల్చివేసి, రాబోయే తరానికి బంగారు బాట వేస్తున్నామనుకుంటే.. అది చాలా పెద్ద తప్పు. ఈ మాటలు నేను ఇలాంటి ఒక వ్యక్తిగత దూషణకి గురైనటువంటి ఒక ఫ్యామిలీ సభ్యుడిగా మట్లాడడం లేదు. ఒక కొడుకుగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా ఈ దేశానికీ ఓ పౌరుడిగా, సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నాను, రాజకీయనాయకులకు ఓ విన్నపం..దయచేసి ఈ అరాచక సంసృతి ఇక్కడితో ఆపెయ్యండి. రాబోయే తరానికి బంగారు బాట వేసేలాగా, మన నడవడిక ఉండేలా జాగ్రత్త పడండి, ఇది నా విన్నపం మాత్రమే.. ఇది ఇక్కడితో ఆగిపోతుంది అని సెలవు తీసుకుంటున్నాను జై హింద్.