నందమూరి సీనియర్ ఎన్టీఆర్ కొడుకులు, కుమర్తెలు, అల్లుళ్ళు, మనవళ్లు అంతా మొదటిసారి మీడియా ముందుకు వచ్చారు. కారణం సీనియర్ ఎన్టీఆర్ కుమర్తె భువనేశ్వరిపై వైసిపి మంత్రులు అవమానకర రీతిలో నోరు పారేసుకోవడంపై నందమూరి ఫ్యామిలీ మొత్తం మీడియా ఎదుట నిల్చుంది. ఈ మీడియా మీట్ లో బాలకృష్ణ మట్లాడుతూ.. రాజకీయాలకు సంబంధం లేని ఆడవాళ్లపై ఇలాంటి మాటలు మాట్లాడితే ఊరుకోమని, తమ సోదరి భువనేశ్వరిపై మాట్లాడిన మాటలు వ్యక్తిగతంగా ఉన్నాయని, భువనేశ్వరి మీదకి పర్సనల్ గా వెళ్లడమనేది దురదృష్టకరమని, ఇంకోసారి మా ఫ్యామిలీ జోలికి వస్తే ఊరుకోమని, వినకపోతే మెడలు వంచి వినిపిస్తామంటూ బాలయ్య వైసిపి మంత్రులకి మీడియా ఎదుటే వార్నింగ్ ఇచ్చారు.
అసెంబ్లీ అనేది ప్రజాసమస్యలపై పోరాడే సభగా ఉండాలి కానీ, ఆడవాళ్ళ గురించి మాట్లాడే సభగా ఉండకూడదని అన్న బాలయ్య మరోసారి ఫ్యామిలీ జోలీ వస్తే ఖబడ్డార్ అని, మేము చేతులు కట్టుకుని కూర్చోలేదు.. అందరి కుటుంబాల్లో ఆడవాళ్లు ఉన్నారు.. హేళన చేయవద్దు. ఏపీలో దోచుకున్న సొమ్ము ఇంట్లో దాచుకుంటున్నారు తప్ప.. అభివృద్ధి లేదు. కొత్త నీచపు సంస్కృతికి వారు తెరలేపారు.. అన్న బాలయ్య ప్రజల తరఫున.. పార్టీ తరఫున.. నా అభిమానుల తరఫున ఇదే నా హెచ్చరిక.. మళ్లీ ఇలాంటి నీచపు, నికృష్టపు మాటలు మాట్లాడితే సహించేది లేదు. ఖబడ్దార్.. భరతం పడతాం. ప్రతి విషయానికి హద్దు ఉండాలి అని బాలకృష్ణ హెచ్చరించారు. పదవులు శాశ్వతం కాదు.. ఈరోజు మీరుండొచ్చు, రేపు అక్కడ మేముండొచ్చు.. మర్యాద ఇచ్చి పుచ్చుకోండి.. అంటూ వైసిపి మంత్రులని హెచ్చరించారు.