సినిమాలు చేస్తూ విపరీతమైన క్రేజ్ వచ్చాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి రాజకీయాల్లోకి దూకారు. అన్న చిరంజీవి రాజకీయాల్లో సక్సెస్ అవ్వకపోయినా.. ధైర్యం చేసి పవన్ పాలిటిక్స్ లోకి వచ్చారు. పోటీ చేసి ఎన్నికల్లో ఓడిపోయినా.. పవన్ మాత్రం రాజకీయంగా పోరాడుతూనే ఉన్నారు. తాజాగా విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అంటూ విశాఖ స్టీల్ ప్లాన్ ఉద్యమానికి మద్దతునిస్తున్నారు. అయితే పవన్ తాజాగా మీడియా తో మట్లాడుతూ సరదా కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని, సమాజం కోసం వచ్చానని స్పష్టం చేశారు. తాను పార్టీని నడుపుతున్నానని, సినిమా హాల్‌ను నడపడం లేదన్నారు. పార్టీని నడపడం చాలా కష్టసాధ్యమైన విషయమని చెప్పారు.
ఒక ఎత్తెన కట్టడం కట్టేందుకు లోతైన పునాది వేయాలన్నారు.తాను పార్టీ పెట్టి పాలిటిక్స్ కి పునాది వేసి ఏడేళ్లవుతుందని, బలమైన ప్రభుత్వాన్ని స్థాపించాలంటే జనసైనికులు క్రమశిక్షణతో ఉండాలని పవన్‌కల్యాణ్ సూచించారు. అంతేకాకుండా వైసిపి నేతలపై పవన్ ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలకు మాట్లాడడం రాదు.. అరుపులు, కేకలు తప్ప. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడానికా మిమ్మల్ని ఎన్నుకుంది.. అసలు ప్రజా సంక్షేమం, అభివృద్ధి పక్కపక్కనే ఉండాలి. నవరత్నాలు అనే ఉంగరం ఇస్తే.. ప్రజల ఆకలి తీరుతుందా.. చదువుకోవాల్సిన 10 ఏళ్ల విద్యార్థి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైసీపీ నేతలకు జనసైనికులు భయపడాల్సిన అవసరం లేదు.. అంటూ పవన్ కళ్యాణ్ జనసైనికుల్లో ఉత్సాహాన్ని నింపారు.