కన్నడ టాప్ హీరో పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో కర్ణాటక అంతా మూగబోయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు షాక్ కి గురయ్యారు. పునీత్ రాజ్ కుమార్ మరణం అభిమానులకి తీరని లోటు గా మారిపోయింది. 46 ఏళ్ళ వయసులో పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించడం ఫాన్స్ మాత్రమే కాదు.. సినీ, రాజకీయ ప్రముఖులు ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ రోజు టాలీవుడ్ నుండి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, రానా, నరేష్, శివబాలాజీ పునీత్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు ర్పించారు. బాలకృష్ణ పునీత్ భౌతిక కాయం వద్ద కన్నీళ్లు పెట్టుకున్నారు. వ్యక్తిగతంగా పునీత్ మరణం తీరని లోటుగా పేర్కొన్నారు.
ఈరోజు సాయంత్రం పునీత్ రాజ్ కుమార్ పెద్ద కూతురు అమెరికా నుండి రాగానే పునీత్ అన్న రాఘవేంద్ర కొడుకు వినయ్ రాజ్ కుమార్ చేతుల మీదుగా పునీత్ అంత్యక్రియలు కంఠీరవ స్టూడియో లో ప్రభుత్వ లాంఛనాలతో జరిపించబోతున్నట్టుగా కర్ణాటక సీఎం బొమ్మై ప్రకటన చేసారు. అయితే ఇప్పడు పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు రేపటికి వాయిదాపడ్డాయి. పునీత్ కుటుంబ సభ్యుల రాక ఆలస్యమవడంతో పునీత్ అంత్యక్రియలు వాయిదా వేస్తున్నట్టుగా సీఎం మరో ప్రకటన చేసారు. ఇక పునీత్ పెద్ద కూతురు ఇప్పటికే అమెరికా నుండి ఢిల్లీ చేరుకొని.. సాయంత్రానికి తండ్రి భౌతికకాయం వద్దకు చేరుకోనుంది. తమ అభిమాన హీరోని కడసారి చూసేందుకు అభిమానులు కంఠీరవ స్టేడియమ్ కి క్యూ కట్టారు. అలాగే సినీ, రాజకీయ ప్రముఖులు పునీత్ చివరి చూపు కోసం పోటెత్తారు.