కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణ వార్త ఆయన అభిమానులే కాదు.. టాలీవుడ్ స్టార్స్, కోలీవుడ్ స్టార్స్ ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్న ఉదయం వ్యాయామం చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో.. ఆయన 11 గంటల ప్రాంతంలో మృతి చెందారు. ఆయన మరణ వార్త విన్న అభిమానులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇక పునీత్ హాస్పిటల్ కి చేరుకోగానే కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై బెంగుళూర్ విక్రమ్ ఆసుపత్రికి చేరుకొని.. ఆయన మృతిని మీడియాకి ప్రకటించడం, భౌతిక కాయం ఇంటికి వచ్చేవరకు అన్ని ఏర్పాట్లను దగ్గర ఉండి చూసుకున్నారు. కర్ణాటకలో నిన్న హై అలెర్ట్ ప్రకటించడం, థియేటర్స్ మూసివేయడం.. అన్ని చకచకా నిర్ణయాలు తీసుకున్నారు.
ఇక ఈ రోజు సాయంత్రం పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరిపించబోతున్నట్టుగా కర్ణాటక సీఎం బొమ్మై ప్రకటించారు.
సాయంత్రం ఐదు గంటలకు పునీత్ రాజ్ కుమార్ పెద్ద కూతురు తండ్రి కడసారి చూపు కోసం అమెరికా నుండి వస్తుంది. అనంతరం పునీత్ రాజ్ కుమార్ అన్న కొడుకు వినయ్ రాజ్ కుమార్.. బాబాయ్ పునీత్ అంత్యక్రియలు నిర్వహిస్తారని, పునీత్ తల్లితండ్రుల సమాధుల వద్ద అంటే కంఠీరవ స్టూడియోలోనే పునీత్ అంత్య క్రియలు జరపబోతున్నట్టుగా ప్రకటించారు. ఇక పునీత్ భౌతిక కాయాన్ని సందర్శించేందుకు టాలీవుడ్ ప్రముఖులు బెంగుళూరుకి తరలి వెళుతున్నారు. అందులో బాలయ్య, చిరు, ఎన్టీఆర్ ఇంకా కొంతమంది సినీప్రముఖులు ఉన్నారు.