2019 లో చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి.. నేటికీ ప్రపంచాన్ని గజగజ ఒణికిస్తూనే ఉంది. జూన్, జులై నాటికీ సెకండ్ వేవ్ తగ్గి.. సాధారణ పరిస్థితికి చేరుకున్నాము అనుకునేలోపు కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికి పలు దేశాల్లో కొవిడ్ కేసులు, మరణాలు క్రమంగా పెరుగుతున్నాయి. బ్రిటన్‌లో శుక్రవారం కొత్తగా సుమారు 50 వేల కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా రష్యా, ఉక్రెయిన్, రుమేనియాల్లో కరోనా మహమ్మారి తీవ్రత ఎక్కువవుతోంది. మరోపక్క కరోనా పుట్టినిల్లు చైనాలోనూ కరోనా కమ్మేసింది. దీంతో అక్కడి ప్రభుత్వం కొవిడ్ ఆంక్షలను కఠినతరం చేసింది.
రష్యాలో అయితే శుక్రవారం ఒక్కరోజే 37,141 మంది వైరస్ బారిన పడ్డారు. రష్యాలో తాజా పరిస్థితుల నేపథ్యంలో- ఎక్కడికక్కడ కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధ్యక్షుడు పుతిన్ అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్నచోట్ల శనివారం నుంచే లాక్‌డౌన్ అమలుచేసే అవకాశముందని వెల్లడించారు. రష్యా మొత్తంగా ఈనెల 30 నుంచి వచ్చేనెల 7 వరకూ కార్యాలయాలను మూసివేస్తామని ప్రకటించారు. మాస్కోలో ఈనెల 28 నుంచి లాక్‌డౌన్ అమలు చేయనున్నారు. దేశంలో ఇప్పటివరకూ 45% మందికే పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అందించారు.
చైనాలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గురువారం 28, శుక్రవారం 32 కేసులు చైనా వ్యాప్తంగా వెలుగుచూశాయి. ఒక్కకేసు కూడా చైనాలో ఉండకూడదు అన్న పట్టుదలతో, మళ్లీ ఎక్కడికక్కడ ఆంక్షలను కఠినతరం చేశారు. కరోనా కేసులు మొదలైన చోట్ల అఛూల్స్, పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. విమాన సర్వీసులను నిలిపివేశారు. అంతేకాకుండా లాంజోవ్ నగర ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని గట్టి ఆదేశాలు జారీచేశారు. అయితే కరోనా కేసులు అంత తక్కువగా నమోదు అవుతున్నా ఇంత కఠినంగా ఆంక్షలు పెడుతున్న చైనా పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.