మా ఎన్నికలు ప్రకాష్ రాజ్ - మంచు విష్ణు ప్యానల్ మధ్యన హోరా హోరీగా జరిగాయి. ఫైనల్ గా ఈ ఎన్నికల్లో మంచు విష్ణునే విజయ సాధించి మా అధ్యక్షుడయ్యాడు. అయితే మా ఎన్నికల్లో మంచు మోహన్ బాబు, ఎన్నికల అధికారి అవకతవకలకు పాల్పడ్డారు అంటూ ప్రకాష్ రాజ్.. మా ఎన్నికలు జరిగిన రోజు సీసీ టివి ఫుటేజ్ కావాలంటూ మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు లేఖ రాశారు. ఆ ఎన్నికల్లో ఏం జరిగిందో తెలుసుకుని అన్ని సీక్రెట్స్ బయట పెడతాను అంటూ ప్రకాష్ రాజ్ చెప్పడం.. సీసీ కెమెరాలు పరిశీలించాక ఓ వారం రోజుల్లో అన్ని విషయాలు బయట పెడతాను అన్నారు.
ఇక తాజాగా మా ఎన్నికల రోజున వైసిపి నేత నూకల సాంబశివరావుని ఎలా అనుమతించారంటూ.. మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ప్రశ్నల వర్షం సందించడమే కాదు.. మోహన్ బాబు ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన నూకల సాంబశివరావు మా ఎన్నికల రోజున అక్కడే ఉన్నారని, అతను వైసిపి కార్యకర్త అని, సాంబశివరావుపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని, అతను మా ఓటర్లు ని బెదిరించారని.. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ప్రకాశ్‌రాజ్ డిమాండ్ చెయ్యడమే కాదు.. మంచు ఫ్యామిలీతో సాంబశివరావు కి ఉన్న సంబంధాలను, ఎన్నికల టైములో విష్ణు తో సాంబశివరావు తో దిగిన ఫొటోస్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేసారు ప్రకాష్ రాజ్. ఈ వీడియోలను అతి త్వరలో బయటపెడతానని ప్రకాశ్‌రాజ్ ట్వీట్ చేసారు. మరి ఎన్నికలు జరిగి రెండు వారాలు పూర్తవుతున్నా మా ఎన్నికల వేడి మాత్రం ఇంకా తగ్గలేదు.