Advertisementt

అడుగడుగునా దాసరి లేని లోటు

Sat 09th Oct 2021 01:34 PM
dasari narayana rao,maa elections,manchu vishnu,prakash raj  అడుగడుగునా దాసరి లేని లోటు
Dasari garu we miss You అడుగడుగునా దాసరి లేని లోటు
Advertisement
Ads by CJ

యధా రాజా.. తథా ప్రజా అంటారు. కానీ  అసలు రాజే లేకపోతే..... ఆ రాజ్యం పరిస్థితి ఎలా ఉంటుంది...!? ఖచ్చితంగా  నేటి తెలుగు చలన చిత్ర పరిశ్రమ పరిస్థితి.. దుస్థితి అదే.

రాజు లేని రాజ్యం లాగా, ఇంటి పెద్ద లేని కుటుంబం లాగా, నాయకుడు లేని ఉద్యమం లాగా,  ఉపాధ్యాయుడు లేని  క్లాస్ రూమ్ లాగా  అయోమయంగా, అరాచకంగా తయారయింది చిత్ర పరిశ్రమ .  ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న  పరిస్థితిని గమనిస్తే చెప్పేవాడు లేక చెడిపోయిన కుర్రతనం, వెర్రితనం, మొండితనం కనిపిస్తున్నాయి. నాయకత్వ లోపంతో , ప్రాతినిధ్య లోపంతో చిత్రపరిశ్రమ ప్రతిష్ట  పలచబడి , మసకబారి నవ్వుల పాలు అవుతున్న ఈ సందర్భంలో ఇప్పుడు గానీ  గురువుగారు ఉంటేనా...!?  అనని వారు ,అనుకోని వారు చిత్ర పరిశ్రమలో లేరు అంటే అతిశయోక్తి కాదు.

ఇప్పుడు గాని గురువుగారు ఉండి ఉంటే ఈ గొడవలు, ఈ గందరగోళం, ఈ  ఆందోళనలు,ఈ పరస్పర ఆరోపణలు,  హననాలు ఉండేవి కాదు.... అన్నది పరిశ్రమలో ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తున్న మాట. నిజమే ....ఈ రోజున చిత్ర పరిశ్రమలో నెలకొన్న అప్రతిష్టాకరమైన పరిస్థితులు, పరిణామాలు అనుదినం, అనుక్షణం ఆయన నిష్క్రమణను గుర్తు చేస్తున్నాయి 

ఆయన మాటకు ,ఆయన బాటకు  అంత విలువ, గౌరవం ఉన్నాయా..!? అంటే ...ఉన్నాయి అని ఘంటా పథంగా చెబుతుంది దశాబ్దాల సినీ చరిత్ర. ఇంతకీ  ఎవరా   గురువుగారు ...!?ఎవరా సినీ పెద్ద...!? 

ఎవరా పరిష్కార కర్త...!? అంటే

శతాధిక చిత్ర దర్శక శిఖరం దాసరి నారాయణరావు అనే సమాధానం ముక్తకఠంగా వినిపిస్తోంది.

అవును ...దాసరి నారాయణరావు మరణం తరువాత తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రస్ఫుటమైన నాయకత్వ లోపాన్ని ఎదుర్కొంటోంది . పరిశ్రమలో ఒక సమస్య గానీ , ఒక వివాదం గానీ ఉత్పన్నమైనప్పుడు  దానిని ఆయన పరిష్కరించే విధానంలో ఎంతో సమర్థత, సంయమనం, సమయస్ఫూర్తి కనిపించేవి. చిత్ర పరిశ్రమలో ఇలాంటి సమస్యలు, సందర్భాలు కోకొల్లలు ఉన్నాయనీ  అవి పరిశ్రమ ప్రతిష్టను దెబ్బ తీస్తాయి అనీ దాసరి ఉన్నంత వరకు ఎవరికీ తెలియదు..

అన్నీ ఆయనే చూసుకుంటారులే అన్న భరోసాతో ఎవరు ఎలాంటి  విషయాలను, వివాదాలను పట్టించుకునే వారు కాదు.  ఎంత పెద్ద వివాదాన్ని అయినా,ఎంత పెద్ద  సమస్యనైనా పరిష్కరించి ఇరువర్గాలను సముదాయించి, సంతోషంగా పంపించే దాసరి సమర్ధత, విజ్ఞతలు ఈరోజున చిత్రపరిశ్రమలో నిత్య స్మరణీయం అయ్యాయి అన్నది నిర్వివాదాంశం.

 2017 మే 30న దాసరి నారాయణరావు చనిపోయినది మొదలు  ఈ నాలుగు నాలుగున్నర సంవత్సరాల కాలంలో చిత్ర పరిశ్రమలో జరిగిన కొన్ని సంఘటనలు, ఏర్పడిన వివాదాలను గమనిస్తే దాసరి ముందు..దాసరి తరువాత" అనే కాల విభజన కళ్ళ ముందు స్పష్టంగా కదలాడుతుంది. 

ఈ నాలుగేళ్లలో చిత్ర పరిశ్రమలో వివిధ సందర్భాలలో ఏర్పడిన వివాదాలు, చెలరేగిన గొడవలు పరిశ్రమ పరువును బజారుకీడ్చాయి  అన్నది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రాంగణంలో ఒక అమ్మాయి బట్టలూడదీసుకొని అర్ధనగ్న ప్రదర్శనకు పాల్పడిన సందర్భంలో జరిగిన రచ్చ  చిత్ర పరిశ్రమను  తీవ్రమైన నైతిక సంక్షోభంలోకి నెట్టి వేసింది.

ఆ పరిస్థితిలో ఇప్పుడుగానీ గురువు గారు ఉంటేనా...  అనుకోని వారు లేరు. పరిశ్రమ ప్రతిష్టతో పాటు మహిళల భద్రత ,ఆత్మగౌరవంతో ముడిపడిన ఆ ఉదంతాన్ని ఆయన  సున్నితంగా, అత్యంత చాకచక్యంగా హ్యాండిల్  చేసే వారు. కానీ ఆయన లేకపోవడంతో ఆమె తన బట్టలూడదీసుకోవటమే కాకుండా చిత్ర పరిశ్రమకు కూడా వస్త్రాపహరణ  అవమానాన్ని మిగిల్చింది.

దాసరి ఉన్నంతవరకు చిత్ర పరిశ్రమలో 24 శాఖల  ఎన్నికలు సజావుగా జరిగేవి ఫిలిం  ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్,  ఫిలిం ఫెడరేషన్, చిత్రపురి హౌసింగ్  కాలనీ   వంటి సుప్రీం బాడీస్ లో  ఎన్నికలు అనివార్యం అయినప్పటికీ అవి కూడా సాధ్యమైనంత సామరస్య  వాతావరణంలో జరగటం వెనుక ఉన్న ప్రచ్ఛన్న, ఆపన్న హస్తం దాసరి నారాయణ రావే అన్నది జగమెరిగిన సత్యం.

ఇక మిగిలిన చిన్నా చితక అసోసియేషన్ల విషయంలో కూడా  దాసరి చొరవ, దాసరి మాట వేద వాక్యంగా, శిరోధార్యంగా చలామణి అయ్యేవి. ఈసారి నువ్వు  ప్రెసిడెంట్,వీడు సెక్రటరీ... వీడు ట్రెజరర్ అంటూ తన ఇంటిలోనే ఏకగ్రీవ ఎన్నికలు జరిపిన సాధికారత, సమర్ధత దాసరి సొంతం. ఆయన ఇంటి గేటు వరకు నువ్వా నేనా అన్నట్టు జుట్టు జుట్టు  పట్టుకుని లోపలకు వెళ్తారు ...కానీ లోపలకు వెళ్లాక మరి ఆయన ఏం మంత్రం వేస్తారో.. ఏం మాయ చేస్తారో తెలియదు కానీ "అలాగే గురువు గారు... మీరు ఎలా చెప్తే అలాగే గురువు గారు.. అంటూ జట్టుకట్టి బయటకు రావటం దాసరి సమర్థ నాయకత్వానికి నిదర్శనం.

చిత్ర పరిశ్రమను స్వరాష్ట్రానికి తరలించడం  మొదలుకొని ఎన్నెన్నో సంక్లిష్ట ,సంక్షోభ సమయాలలో  దాసరి నారాయణరావు ప్రదర్శించిన విజ్ఞత, సమర్థతలు శతధా ప్రశంసనీయం. సమస్యల ముళ్ళ పొదలను తాను కౌగిలించుకుని పరిష్కారాల పూల 

గుత్తు లను పరిశ్రమకు పంచిపెట్టిన 

గ్రేట్ ట్రబుల్ షూటర్  దాసరి నారాయణ రావు . నేటి పరిస్థితుల్లో ఆయన లేని లోటు అనుక్షణం గుర్తుకు రావటంలో ఆశ్చర్యం ఏమి లేదు. 

ముఖ్యంగా ఈ నెల 10వ తేదీన జరుగనున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు అత్యంత వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో దాసరి నారాయణరావు వంటి సంధానకర్త లేకపోవడం నిజంగా దురదృష్టకరం. ఆయన లేకుండా జరుగుతున్న ఈ  ఎన్నికల 

కురుక్షేత్రం  ఎలాంటి విపరీత పరిస్థితులకు, పరిణామాలకు దారి తీయకూడదని ప్రార్థించడం తప్ప  చేయగలిగింది ఏమీ లేదు .

 ఇలాంటి సందర్భాల్లోనే అనిపిస్తుంది Dasari garu we miss You .. అని.

Dasari garu we miss You:

Dasari garu we miss You

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ