నటీనటులు: దీక్షిత్ శెట్టి, శ్వేతా వర్మ, రాజా రవీంద్ర, అర్చనా కుమార్, టిఎన్ఆర్, వెన్నెల రామారావు తదితరులు
సమర్పణ: చిత్రమందిర్ స్టూడియో
కాన్సెఫ్ట్ అండ్ స్టోరి: ఆకాంక్ష రాథోర్
డైలాగ్స్ అండ్ లిరిక్స్: వరదరాజ్ చిక్కుబళ్ళాపుర
బ్యాగ్రౌండ్ స్కోర్: సోలో రాజ్. ఎమ్
కెమెరా: గరుడవేగ అంజి
ఎడిటింగ్: శివ శర్వాణి, రవిశంకర్
సంగీతం: సురేష్ బొబ్బిలి
నిర్మాత: అచ్యుత రామారావు పి.
కథ, స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: హేమంత్
చిన్న సినిమాలలో కంటెంట్ ఉంటే బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద చిత్రాలుగా నిలబడతాయో ఇప్పటికే ఎన్నో సినిమాలు నిరూపించాయి. అలాగే కంటెంట్ కరెక్ట్‌గా పడితే.. చిన్నసినిమాలను ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారు. ఇప్పుడొస్తున్న డైరెక్టర్లు చాలా మంది చిన్న సినిమాలతో నిరూపించుకున్నవారే. అలా తన టాలెంట్ ఏంటో చూపించేందుకు ‘ది రోజ్ విల్లా’ అనే సైకలాజికల్ థ్రిల్లర్‌తో హేమంత్ అనే దర్శకుడు రూపొందిన చిత్రం ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. కరోనా టైమ్‌లో థియేటర్లలోకి రావడానికి పెద్ద సినిమాలే వెనకడుగు వేస్తుంటే.. ధైర్యంగా ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేశారంటేనే వారి కాన్ఫిడెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ చిత్ర ట్రైలర్‌లో సీనియర్ నటుడు రాజా రవీంద్ర కనబడిన తీరు కూడా సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసింది. మరి కాన్ఫిడెంట్‌గా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో మన సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
కొత్తగా పెళ్లయిన దంపతులు డాక్టర్ రవి(దీక్షిత్ శెట్టి), రచయిత్రి శ్వేత(శ్వేతా వర్మ). కొన్ని పనుల నిమిత్తం వారిద్దరు కారులో మున్నూరు వెళుతుండగా.. దారిలో వారి కారు చెడిపోతుంది. కారు వదిలేసి నడక సాగించిన వారు దారి తప్పి ఓ అడవి మార్గానికి వెళ్లిపోతారు. దారిలో వారిని గమనించిన ఇన్‌స్పెక్టర్ శివ (వెన్నెల రామారావు) వారిని దగ్గరలోని ఓ రెస్టారెంట్‌లో వదిలేసి జాగ్రత్తగా వెళ్లమని చెబుతాడు. రెస్టారెంట్‌లో ఏదైనా తిని తమ పనుల నిమిత్తం ప్లాన్ చేసుకోవాలని రవి, శ్వేత అనుకుంటారు. అప్పుడే పక్క టేబుల్ వద్ద తింటూ తింటూ సడెన్‌గా హార్ట్ అటాక్‌కి లోనవుతాడు సోలోమాన్(రాజా రవీంద్ర). డాక్టర్ రవి సహకారంతో సోలోమాన్ ప్రాణాపాయం నుండి బయటపడతాడు. అందుకు గానూ దగ్గరలో ఉన్న తమ రోజ్ విల్లాకు వచ్చి.. అతిథ్యం స్వీకరించాలని సోలోమాన్, అతని భార్య హెలెన్ (అర్చనా కుమార్) కోరతారు. వారి కోరికను కాదనలేక రోజ్ విల్లాకు వెళ్లిన వారికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి? సోలోమాన్, హెలెన్ ఫ్యామిలీ ఫొటోలో రవి కూడా ఉండటానికి కారణం ఏమిటి? అసలు ఆ రోజ్ విల్లాలో ఉన్న అంతుబట్టని రహస్యం ఏమిటి? రవి, శ్వేత ఆ రోజ్ విల్లా నుండి బయటపడ్డారా? లేదా? వంటి ప్రశ్నలకు ట్విస్ట్‌తో కూడిన సమాధానమే మిగతా కథ.
నటీనటుల, సాంకేతిక నిపుణుల పెర్ఫార్మెన్స్
ఈ సినిమాలో అందరికీ తెలిసిన ఫేస్ రాజా రవీంద్ర. ఈ తరహా చిత్రాలలో ఇంతకుముందెన్నడూ రాజా రవీంద్ర కనిపించలేదు. సోలోమాన్ పాత్రను తన సీనియారిటీతో రక్తికట్టించాడు. భార్య సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే పాత్రలో రాజా రవీంద్ర కనిపించలేదు.. అతని పాత్రే కనిపించింది. డాక్టర్ రవిగా దీక్షిత్ అనుభవం ఉన్న నటుడిలా అతికిపోయాడు. అతని పాత్ర కూడా ఈ సినిమాకి కీలకం. ఇక శ్వేతా వర్మకు పెద్దగా స్కోప్ దక్కలేదు.. కానీ తన పాత్ర వరకు ఆమె న్యాయం చేసింది. ఇక సినిమాకి మెయిన్ పాత్ర సోలోమాన్ భార్య హెలెన్. ఈ పాత్రలో అర్చనా కుమార్ నటన హైలెట్. కొడుకు కోసం తల్లి పడే ఆవేదన, ఆందోళన ఎలా ఉంటుందీ అనే దానికి ఆమె ఇచ్చిన ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ కరెక్ట్‌గా రీచ్ అయ్యాయి. చాలా సింపుల్‌గా కనిపిస్తూనే.. కథ మొత్తం తన చుట్టూ తిప్పుకునే పాత్ర ఆమెది. ఇక మిగిలిన పాత్రలలో ఇన్‌స్పెక్టర్ శివ, కానిస్టేబుల్ నాయుడు, డాక్టర్‌గా టిఎన్ఆర్ వారి పాత్రల పరిధిమేర నటించారు.
సాంకేతికంగా ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలెట్స్. ‘గరుడవేగ’ అంజి కెమెరాలో బంధించిన ఆహ్లాదకర సన్నివేశాలు చూడచక్కగా ఉన్నాయి. అలాగే సీన్‌కి, మూడ్‌కి తగినట్లుగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఉంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. ఎడిటింగ్ కూడా బాగుంది. కథకు అనుగుణంగా డైలాగ్స్ నడిచాయి తప్ప ప్రత్యేకంగా గుర్తుపెట్టుకునే డైలాగ్స్ అయితే లేవు. దర్శకుడు హేమంత్ తన చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పేశాడు. నిర్మాతలు చిన్న సినిమా అని ఆలోచించలేదు.. రిచ్‌గా తెరకెక్కించారు.
విశ్లేషణ:
తల్లిదండ్రులు పిల్లలపై ఎటువంటి ప్రేమను పెంచుకుంటారో ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. తల్లిదండ్రులను, వారి ప్రేమను వదిలేసి పిల్లలు వెళ్లిపోతే.. వారు పడే మనోవేదన ఎలా ఉంటుందీ అనే విషయాన్ని ట్విస్ట్‌తో మిక్స్ చేసి దర్శకుడు అల్లుకున్న కథ బాగుంది. అలాగే భార్యభర్తల మధ్య ప్రేమానుబంధాలను కూడా సోలోమాన్, హెలెన్ పాత్రలతో దర్శకుడు మలిచిన తీరు ఆకట్టుకుంటుంది. అయితే ఇటువంటి కథలు తెలుగు ప్రేక్షకులకు కొత్తకాదు. చివరి 15 నిమిషాలలో రివీలైన ట్విస్ట్ ఈ సినిమాకి ప్రాణం. అది తప్పితే మిగతా అంతా రొటీన్‌గానే అనిపిస్తుంది. అలాగే థ్రిల్లింగ్ అనిపించే అంశాలు కూడా ఇందులో పెద్దగా లేవు. సినిమా రన్ టైమ్ విషయంలో దర్శకుడు పరిణితి కనబరిచాడు. హీరోహీరోయిన్ల మధ్య డ్యూయెట్స్ పెట్టకుండా.. ఇంకొన్ని థ్రిల్లింగ్ అంశాలను మిక్స్ చేస్తే.. ఈ సినిమా స్థాయి మరోలా ఉండేది. ఏదిఏమైనా ఒక సైకలాజికల్ థ్రిల్లర్‌కి ఉండాల్సిన బిగ్ పాయింట్ అయితే ఇందులో ఉంది. నిడివి తక్కువే కాబట్టి.. సరదాగా ఓ లుక్ వేయవచ్చు.
రెట్టింగ్: 2.75/5