రీల్ విలన్ కాస్తా.. కరోనా ఫస్ట్ వేవ్ దగ్గర నుండి రియల్ హీరోగా మారిన సోను సూద్.. కరోనా కష్ట కాలంలో అనేకమందికి హెల్ప్ చేసి దేవుడి మాదిరి పూజింప పడుతున్నాడు. సోను సూద్ రియల్ హీరో కాదు.. ఓ గాడ్ లా భావిస్తున్నారు ఆయన నుండి సాయం పొందిన వారు. అలాంటి వ్యక్తిపై ఐటి శాఖ దాడులు చెయ్యడం ఆయన అభిమానులే జీర్ణించుకోలేకపోతున్నారు. గత మూడు రోజులుగా సోను సూద్ పై జరుగుతున్న ఐటి దాడులకు ఆయన ఫాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అయితే కొన్ని రోజులుగా సోను ఆఫీస్, ఇంటిపై జరుగుతూన్న ఐటి దాడులలో సోను సూద్ 20 కోట్ల పన్ను ఎగవేసినట్లుగా ఐటి అధికారులు చెబుతున్నారు.
2.1 కోట్ల అక్రమ విదేశీ విరాళం, 65 కోట్ల మోసపూరిత లావాదేవీలు, జైపూర్‌లోని ఇన్‌ఫ్రా సంస్థతో 175 కోట్ల సర్క్యులర్ లావాదేవీలు జరిగాయని ఐటీ అధికారులు ఓ ప్రకటన జారీ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. సోనూ ఛారిటీ ఫౌండేషన్ అనే ఎన్జిఓ ని సోను సూద్ జూలైలో స్థాపించినట్లు ఐటీ శాఖ చెబుతోంది.అయితే సోను సూద్ ఈ NGO పేరు మీద ఏప్రిల్ 1, 2021 నుంచి 18.94 కోట్ల విరాళం సేకరించారని.. కానీ అప్పటి నుంచి ఇప్పటి దాకా 17 కోట్ల రూపాయలలో ఒక్క రూపాయి కూడా ఆయన సేవ కోసం ఖర్చు పెట్టలేదని అంటున్నారు, ఇంకా సోను సూద్ పై ఐటి దాడులు ముగియలేదని.. సెర్చింగ్ ఇంకా కొనసాగుతుంది అని.. సోదాలు పూర్తయ్యాక మిగతా వివరాలు తెలియజేస్తామని ఐటి శాఖ అధికారులు చెబుతున్నారు.