దేశ వ్యాప్తంగా మరోసారి కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. కొన్నాళ్లుగా 40వేల దిగువకు నమోదైన కరోనా కేసులు.. ఇప్పుడు కొత్తగా మళ్లీ ఒక్కసారిగా పెరగడం కలవరపెడుతోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 18.17లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా.. 43,263 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అంతకు ముందు రోజుతో పోలిస్తే దాదాపు 6వేల కేసులు పెరగడం గమనార్హం. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.31కోట్లు దాటింది. ఇదే సమయంలో 338 మంది కరోనా కారణంగా మరణించారు.
అయితే దేశం మొత్తం మీద కేరళ రాష్ట్రం లో కరోనా కేసులు మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న మొన్నటిదాకా 20వేల దిగువన ఉన్న కేసులు మళ్లీ 30వేలు దాటడంతో నిపుణులు కూడానా అందోళన వ్యక్తం చేస్తున్నారు. కేరళలో నిన్న ఒక్కరోజే 30,196 కేసులు బయటపడ్డాయి. 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరోపక్క వాణిజ్య రాజధాని ముంబయిలోనూ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా అక్కడ 500లకు పైగా కొత్త కేసులు బయటపడ్డాయి. ముంబయిలో ఈ స్థాయిలో కేసులు రావడం జులై 15 తర్వాత ఇదే తొలిసారి. దానితో కేరళ, మహారాష్ట్రాళ్లలోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవడంపై అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.