ఈ రోజు హీరో నందు ఈడీ ఆఫీస్ కి విచారణకు హాజరవగా.. ఈ మనీ లాండరింగ్ కేసులో కీలకయిన నిందితుడు కెల్విన్ ని కూడా సీఆర్పీఎఫ్ బలగాలతో వెళ్లి మరీ ఈడీ ఆఫీస్ కి విచారణకు తీసుకొచ్చారు. నందు - కెల్విన్ వాట్సప్ చాటింగ్ ,నందు తో కెల్విన్ ఫోన్ సంభాషణ, అలాగే నందు బ్యాంక్ లావాదేవీలు, కెల్విన్ తో మనీ లావాదేవీలు అన్ని విచారించారు ఈడీ అధికారులు. కెల్విన్‌తో పాటుగా పాతబస్తీకి చెందిన వాహిద్, కుదూస్‌ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. కెల్విన్, వాహిద్, కుదూస్ లకు నందుకు మధ్య లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీశారు.
కెల్విన్ ని విచారణకు తీసుకురాకముందు నందుని నాలుగు గంటలు విచారించిన అధికారులు.. కెల్విన్ తో పాటుగా మరో నాలుగు గంటలు హీరో నందుని ఈడీ అధికారులు ఊపిరి సలపని ప్రశ్నలతో ఊపిరాడకుండా చేసారు. ఇక నేడు నందు విచారణ పూర్తి కాగా.. రేపు ఈ కేసులో మొదటగా రానా విచారణకు హాజరు కాబోతున్నాడు. డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ అధికారులు రానా పేరు చేర్చకపోయినా.. మనీ లాండరింగ్ కేసులో రానా పేరుని చేర్చడం హాట్ టాపిక్ అయ్యింది. ఇక రేపు ఈ కేసులో రానా ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరు కాబోతున్నాడు.