జయలలిత నమ్మిన బంటు, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. పన్నీర్ సెల్వం భార్య విజయలక్ష్మి(63) బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈమధ్యనే ఆమెకి గుండెపోటు రావడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచినట్టుగా అన్నాడీఎంకే పార్టీ వర్గాలు వెల్లడించాయి. పన్నీర్ సెల్వం భార్య మరణవార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆస్పత్రికి వెళ్లి పన్నీర్ సెల్వం, ఆయన తనయుడు, ఎంపీ ఓపీ రవీంద్రనాథ్‌లను ఓదార్చారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మాజీ సీఎం పళనిస్వామితో పాటు భాజపా, సీపీఐ, సీపీఎం, తదితర రాజకీయ పార్టీల నేతలు, ఎమ్మెల్యేలు ఆస్పత్రికి వెళ్లి పన్నీర్ సెల్వం పరామర్శించారు. పన్నీర్ సెల్వం సతీమణి మరణవార్త తెలుసుకున్న అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ కూడా ఆస్పత్రికి వెళ్లారు.
పన్నీర్ సెల్వం సతీమణి విజయలక్ష్మీ మృతిపట్ల శశికళ సంతాపం తెలిపారు. అనంతరం పన్నీర్ సెల్వం ను పరామర్శించి.. ఓదార్చారు. ఆయన పక్కనే కూర్చొని విజయలక్ష్మీకి అందించిన వైద్య చికిత్సల గురించి అడిగి తెలుసుకున్నారు. శశికళ దాదాపు 20 నిమిషాల పాటు ఆస్పత్రి వద్దే ఉన్నట్టు సమాచారం.