మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రం డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రూపొందనుంది. ఈ విషయాన్ని శనివారం మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా తెలియజేశారు. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కనుందని ఆ పోస్టర్ ద్వారా అర్థమైంది. ఆదివారం(ఆగస్ట్ 22) చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా, ఆయనకు విషెష్ తెలియజేస్తూ చిత్ర నిర్మాతలు ఈ సినిమాకు సంబంధించి మరో పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో చిరంజీవి మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు.
పోస్టర్‌ను గమనిస్తే.. తలకు రెడ్ టవల్ చుట్టుకుని, బీడి కాలుస్తూ, లుంగీ కట్టుకుని నిల్చున్న చిరంజీవి లుక్ ఊరమాస్‌గా అనిపిస్తుంది. చేతిలో లంగరు(యాంకర్) పట్టుకుని బోటుపై చిరంజీవి స్టైల్‌గా ఉన్నారు. అటు పక్కనున్న జెండాపై చిరంజీవి ఇష్టదైవం హనుమంతుడు కనిపిస్తున్నాడు. ఉదయిస్తున్న సూర్యుడు చిరంజీవి అనే విషయాన్ని తెలియజేసేలా అప్పుడే తెల్లవారుతుండగా పైకి వస్తున్న సూర్యుడిని కూడా పోస్టర్‌లో చూడవచ్చు. అలాగే బోటులోని కొంత మంది జాలర్లు బోటుపై నిల్చున్న చిరంజీవిని చూస్తున్నారు. వారందరూ సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లేలా కనిపిస్తుంది. ఈ లుక్ చూస్తుంటే చిరంజీవి ముఠామేస్త్రీ, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు చిత్రాల్లోని వింటేజ్ లుక్ గుర్తుకు వస్తుంది. పోస్టర్‌లో కనిపిస్తున్న `పూనకాలు లోడ్ అవుతున్నాయి..` అనే వాక్యం పోస్టర్‌ని, అందులోని చిరంజీవి లుక్ గురించి తెలియజేస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి డై హార్డ్ అభిమాని అయిన డైరెక్టర్ బాబీ, ఆయన కోసం ఓ పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో గ్రాండియర్‌గా ఈ సినిమాను రూపొందించనున్నారు. ఇది వరకు చిరంజీవితో కలిసి ఎన్నో చార్ట్ బస్టర్స్ అందించిన రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ చిరు 154వ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.